కొత్త ఏడాదిలో తొలి ఎన్నికల నగారా మోగనుంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) కాసేపట్లో ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించనున్నారు. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ముగియనుంది. దీంతో ఫిబ్రవరి నెల మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. 2020లో ఫిబ్రవరి 8న ఓటింగ్ నిర్వహించి అదే నెల 11న ఫలితాలను ప్రకటించారు.
ఈసారి హస్తిన అసెంబ్లీ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ కొనసాగుతోంది. గత రెండు పర్యాయాలు అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు దేశాన్ని ఏలుతున్న ఢిల్లీలోనూ పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా తమ సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో త్రిముఖ పోరు కనపడుతోంది.
కాగా ప్రస్తుత అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా. కాంగ్రెస్, బీజేపీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడించారు.