Delhi Assembly privilege breach : ఢిల్లీ ప్రభుత్వానికి, పంజాబ్ పోలీసులకు మధ్య మరో వివాదం రాజుకుంది. ఢిల్లీ అసెంబ్లీకి చెందిన వీడియో క్లిప్‌ను ఆధారంగా చేసుకుని, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేయడంపై, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసెంబ్లీ హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ, పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ మంత్రి అతిశీకి సంబంధించి, ఎడిట్ చేసి, తారుమారు చేసిన ఓ వీడియోను అప్‌లోడ్ చేసి, సర్క్యులేట్ చేశారన్న ఆరోపణలపై, ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రాతో పాటు మరికొందరిపై జలంధర్ పోలీస్ కమిషనరేట్ కేసు (FIR) నమోదు చేసింది. అయితే, ఈ కేసుకు ఆధారంగా, ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉపయోగించడమే ఇప్పుడు వివాదానికి దారితీసింది.
అసెంబ్లీ హక్కులకు భంగం: స్పీకర్ ఆగ్రహం : శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన స్పీకర్ విజేందర్ గుప్తా, పంజాబ్ పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుబట్టారు.
“ఢిల్లీ అసెంబ్లీ ప్రివిలేజెస్‌కు (హక్కులకు) భంగం కలిగించినందుకు, పంజాబ్ డీజీపీ, స్పెషల్ డీజీపీ (సైబర్‌క్రైమ్), జలంధర్ పోలీస్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేశాం. 48 గంటల్లోగా వారు తమ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.”
– విజేందర్ గుప్తా, స్పీకర్, ఢిల్లీ అసెంబ్లీ
అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను, స్పీకర్ అనుమతి లేకుండా, ఇలాంటి కేసులకు ఆధారంగా ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ ఘర్షణకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

