Sunday, November 16, 2025
Homeనేషనల్Medical Miracle: వైద్యానికే సవాల్ విసిరిన పసికందు: 525 గ్రాముల బరువు.. 105 రోజుల పోరాటం!

Medical Miracle: వైద్యానికే సవాల్ విసిరిన పసికందు: 525 గ్రాముల బరువు.. 105 రోజుల పోరాటం!

Premature baby survival India : కడుపులో ఉండాల్సిన పసికందు నెలలు నిండకుండానే కళ్లు తెరిస్తే.. అరచేతిలో ఇమిడిపోయేంత బరువుతో భూమ్మీదకు వస్తే.. ఆ ప్రాణాన్ని నిలబెట్టడం వైద్యానికే ఓ సవాల్. అలాంటి అసాధారణ సవాల్‌ను ఢిల్లీ వైద్యులు స్వీకరించి, ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కేవలం అరకిలో బరువుతో పుట్టిన ఓ పసికందు, 105 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గెలిచింది. అసలు కేవలం 525 గ్రాముల బరువున్న ఆ శిశువును వైద్యులు ఎలా కాపాడగలిగారు? మూడున్నర నెలల పాటు ఆ పసి హృదయం చేసిన పోరాటం ఏమిటి? ఈ అసాధారణ వైద్య విజయం వెనుక ఉన్న రహస్యమేంటి?

- Advertisement -

ఢిల్లీలోని క్లౌడ్‌నైన్ ఆసుపత్రిలో భారత వైద్య చరిత్రలోనే అరుదైన విజయం నమోదైంది. కేవలం 22 వారాలకే, 525 గ్రాముల బరువుతో జన్మించిన ఓ ఆడశిశువు, వైద్యుల అవిశ్రాంత కృషితో ప్రాణాలతో బయటపడింది.

అద్భుత విజయం వెనుక అంచెలంచెల పోరాటం:
జననమే ఒక సవాల్: సాధారణంగా 40 వారాలకు జన్మించాల్సిన శిశువు, కేవలం 22 వారాలకే పుట్టింది. అప్పటికి శిశువు అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు, బరువు కేవలం 525 గ్రాములు. ఇలాంటి పరిస్థితుల్లో శిశువు బతకడం దాదాపు అసాధ్యమని వైద్య పరిభాషలో చెబుతారు.

ఎన్‌ఐసీయూలో 105 రోజులు: శిశువును వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)కు తరలించారు. అక్కడ డాక్టర్ జై కిషోర్ నేతృత్వంలోని వైద్య బృందం, శిశువును కంటికి రెప్పలా కాపాడింది. 105 రోజుల పాటు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ, శిశువు ప్రాణాలను నిలబెట్టడానికి పోరాటం చేసింది.

అమృతంగా మారిన తల్లిపాలు: ఈ వైద్య విజయంలో అత్యంత కీలకమైన అంశం శిశువుకు అందించిన పోషణ. ఆశ్చర్యకరంగా, ఈ 105 రోజులూ శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించారు. బయటి నుంచి ఎలాంటి పోషకాలను ఇవ్వకుండా, కేవలం తల్లి పాలతోనే శిశువుకు జీవం పోయడం ఈ చికిత్సలోని ప్రత్యేకత.

విజయం వరించిన వేళ: మూడున్నర నెలల అవిశ్రాంత పోరాటం ఫలించింది. శిశువు బరువు క్రమంగా పెరుగుతూ వచ్చింది. డిశ్చార్జి అయ్యే సమయానికి, ఆ చిన్నారి ఆరోగ్యంగా 2.01 కిలోల బరువుకు చేరుకుంది. వైద్యులు శిశువును సంపూర్ణ ఆరోగ్యంతో తల్లిదండ్రులకు అప్పగించారు. ఇది భారత వైద్య రంగంలో సాధించిన ఒక అరుదైన, అద్వితీయమైన విజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad