Delhi Blast’s Telegram Link: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు (Delhi Blast) కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఇతను పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఏ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న “రాడికల్ డాక్టర్ల” బృందంలో సభ్యుడు. ఈ బృందం మొత్తం తమ కుట్రలను, కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడానికి ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram)ను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టెలిగ్రామ్‌ను కేవలం ఒక సురక్షితమైన, ప్రైవసీ-ఫోకస్డ్ మెసేజింగ్ యాప్‌గా మాత్రమే చూస్తారు. 2013లో రష్యాకు చెందిన పావెల్ దురోవ్ సోదరులు దీనిని ప్రారంభించారు. దీనిలోని ‘ఎన్క్రిప్షన్’ (Encryption), ‘పబ్లిక్ ఛానెల్స్’ ఫీచర్లు దీనికి విపరీతమైన ఆదరణ తెచ్చిపెట్టాయి.
ALSO READ: PM Modi: ‘మాట ఇస్తున్నా.. దిల్లీ పేలుడు బాధ్యులను వదిలిపెట్టను’
ఒకవైపు, హాంకాంగ్, బెలారస్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు, అలాగే రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ… తమ గళం వినిపించడానికి టెలిగ్రామ్‌ను ఒక ఆయుధంగా వాడారు.
అయితే, నాణేనికి మరోవైపు, ఇదే టెలిగ్రామ్ ఇప్పుడు ఉగ్రవాదులకు, నేరస్థులకు, విద్వేష ప్రచారకులకు అడ్డాగా మారుతోంది. దీని కఠినమైన ప్రైవసీ పాలసీల కారణంగా, ప్రభుత్వ సంస్థలు వీరిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఐసిస్ (ISIS), అల్-ఖైదా, హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలు… సభ్యుల రిక్రూట్‌మెంట్, నిధుల సేకరణ, దాడుల ప్రణాళికల కోసం ఈ యాప్‌ను విరివిగా వాడుకుంటున్నాయి. 2015లో 130 మందిని బలిగొన్న పారిస్ దాడుల ప్రణాళికలో కూడా టెలిగ్రామ్ పాత్ర ఉన్నట్లు అప్పట్లో తేలింది.
ALSO READ: Encounter: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత.. ఆరుగురు మావోయిస్టుల హతం
ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ దర్యాప్తు ప్రకారం, టెలిగ్రామ్‌లో సుమారు 1,500 శ్వేతజాత్యహంకార ఛానెళ్లు (దాదాపు 10 లక్షల మంది సభ్యులతో), అలాగే ఆయుధాలు, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ అమ్మే డజన్ల కొద్దీ ఛానెళ్లు బహిరంగంగా నడుస్తున్నాయి.
ఈ ఆరోపణలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్పందన ఎప్పుడూ వివాదాస్పదమే. “ఉగ్రవాదం వంటి చెడు విషయాల భయం కంటే, ‘ప్రైవసీ హక్కు’ (Right for Privacy) మాకు ముఖ్యం” అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. కోర్టు ఆర్డర్ ద్వారా టెర్రర్ సస్పెక్ట్ అని ధృవీకరిస్తే తప్ప (అది కూడా ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు) తాము యూజర్ల ఐపీ అడ్రెస్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను ప్రభుత్వాలకు ఇవ్వమని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఢిల్లీ పేలుడు ఘటనతో టెలిగ్రామ్ మరోసారి వార్తల్లో నిలిచింది.
ALSO READ: Bihar Exit Polls: ఎన్డీయేదే మళ్లీ అధికారం.. బిహార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే.. పీకేకి నిరాశే.!


