Saturday, November 15, 2025
Homeనేషనల్ROAD ACCIDENT: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం... బీఎండబ్ల్యూ ఢీకొని ఆర్థిక శాఖ డిప్యూటీ...

ROAD ACCIDENT: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం… బీఎండబ్ల్యూ ఢీకొని ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి!

Delhi BMW accident death : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ విలాసవంతమైన కారు సృష్టించిన బీభత్సంలో ఓ ఉన్నతాధికారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు, ఓ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో, కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవ్‌జోత్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. దగ్గరలో పెద్ద ఆసుపత్రులున్నా, 20 కిలోమీటర్ల దూరంలోని చిన్న ఆసుపత్రికి తరలించడంపై మృతుడి కుమారుడు వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటి..? అసలు ఆ రోజు ఏం జరిగింది..?

- Advertisement -

అసలేం జరిగిందంటే : పోలీసులు, మృతుడి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం..
గుడికి వెళ్లి వస్తుండగా: కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్, ఆయన భార్య కలిసి ఆదివారం గుడికి వెళ్లి, బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు.

వెనుక నుంచి ఢీ: కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అధికారి మృతి, భార్యకు తీవ్ర గాయాలు: ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, నవ్‌జోత్ సింగ్ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కుమారుడి ఆవేదన.. అనుమానాల వలయం : ఈ ఘటనపై నవ్‌జోత్ కుమారుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కొన్ని అనుమానాలను లేవనెత్తారు. “ప్రమాదం జరిగిన ధౌలా కువాన్ ప్రాంతానికి సమీపంలోనే ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. కానీ, నా తల్లిదండ్రులను 20 కిలోమీటర్ల దూరంలో, సరైన సౌకర్యాలు లేని నులైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. దగ్గరలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే, నా తండ్రి బతికేవారేమో. కారు నడిపిన వారు కూడా అదే ఆసుపత్రిలో చేరడం అనుమానంగా ఉంది.”
– నవ్‌జోత్ సింగ్ కుమారుడు

పోలీసుల దర్యాప్తు : ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ డ్రైవింగ్: ప్రమాద సమయంలో కారును ఓ మహిళ నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత, కారులోని వారే బాధితులను ట్యాక్సీలో ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

వాహనాల స్వాధీనం: ప్రమాద తీవ్రతకు బైక్ పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా, కారు ముందు భాగం ధ్వంసమైంది. రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫోరెన్సిక్ విచారణ: క్రైమ్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించింది. ఫోరెన్సికి సైన్స్ లాబొరేటరీ బృందం కూడా దర్యాప్తులో పాల్గొంటోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad