బీజేపీ నేత రమేశ్ బిధూరి(Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిశీ(Atishi) కంటతడి పెట్టుకున్నారు. తన తండ్రి జీవితమంతా ఉపాధ్యాయుడిగా పనిచేశారని తెలిపారు. వేలాది మంది పేద, మధ్య తరగతి పిల్లలకు చదువు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు తన తండ్రి 80 ఏళ్లు వయసులో నడవలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు.
కాగా అతిశీ ఇప్పుడు తన ఇంటి పేరుతో పాటు తండ్రిని కూడా మార్చారంటూ రమేశ్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ లక్షణాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు క్షమాబిక్ష కోసం ఆమె తల్లిదండ్రులు అప్పట్లో క్షమాభిక్ష పిటిషన్ సమర్పించారని వెల్లడించారు. ఓ ఉగ్రవాదికి క్షమాపణ కోరిన కుటుంబానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీపై కూడా రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రియాంక గాంధీ చెంపల్లా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని రోడ్లను నున్నగా చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహిళా నేతలపై రమేశ్ బిధూరి చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.