Delhi : దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో దాడి జరిగింది. ప్రజా సమస్యలను వినే ‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ALSO READ: Hyderabad: రోజులు గడుస్తున్నా వీడని మిస్టరీ..సహస్రను చంపిందేవరు?
35 ఏళ్ల వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తి ముఖ్యమంత్రికి కొన్ని పత్రాలు అందించిన తర్వాత గట్టిగా అరుస్తూ దాడి చేశాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన రేఖా గుప్తాను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇక ముఖ్యమంత్రిపై జరిగిన ఈ దాడిని రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. భాజపా దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఈ ఘటనను దారుణమని పేర్కొన్నారు. దిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా మాట్లాడుతూ, ప్రజల కోసం శ్రమిస్తున్న సీఎంపై దాడి రాజకీయ కుట్ర కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దిల్లీ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కోణంలో కూడా విచారణ జరపాలని ఆయన సూచించారు.
ప్రతిపక్ష నేత ఆతిశీ ఈ దాడిని ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. దిల్లీ పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, సీఎంకే భద్రత లేనప్పుడు సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ పోలీసులు నిందితుడి నేపథ్యం, దాడి వెనుక ఉద్దేశాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా క్షేమంగా ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆమె సన్నిహితులు తెలిపారు.


