Delhi Court Dismisses Corruption Case Against Satyendar Jain: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత సత్యేంద్ర జైన్‌కు ఊరటనిచ్చింది. ఆయనపై ఉన్న అవినీతి కేసును కొట్టివేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపారన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 2019లో కేసు నమోదు చేసింది. అయితే, నాలుగు సంవత్సరాల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ కోర్టుకు క్లోజర్ రిపోర్ట్ సమర్పించింది. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి దిగ్ విజయ్ సింగ్ ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో.. పీడబ్ల్యూడీలో 17 మంది కన్సల్టెంట్‌లను నియమించుకోవడానికి జైన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. కానీ, సీబీఐ దర్యాప్తులో ఈ నియామకాలు అత్యవసర పరిస్థితుల్లో, పారదర్శకంగా జరిగాయని, అవినీతికి లేదా అక్రమాలకు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది.
“క్రిమినల్ కుట్రకు లేదా వ్యక్తిగత ప్రయోజనాలకు ఆధారాలు లేవు. ఆరోపణలకు మించి ఎటువంటి రుజువులు లేవు” అని జడ్జి సింగ్ తన తీర్పులో పేర్కొన్నారు. భవిష్యత్తులో కొత్త ఆధారాలు లభిస్తే కేసును తిరిగి ప్రారంభించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సత్యేంద్ర జైన్ సహా ఆప్‌కు పెద్ద ఊరట లభించింది.


