Sonia Gandhi Citizenship: కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటు హక్కు పొందారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం కొట్టివేసింది. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఈ పిటిషన్‌ను న్యాయవాది వికాస్ త్రిపాఠి దాఖలు చేయగా.. కేసును తోసిపుచ్చడంతో ఆమెకు ఉపశమనం లభించింది.
ఆరోపణల్లో పస లేదంటూ కొట్టేసిన కోర్టు
భారత పౌరసత్వం పొందడానికి ముందే 1980లో సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని.. ఆ తర్వాత 1982లో ఎన్నికల సంఘం ఆమె ఓటు హక్కును తొలగించిందని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సోనియా గాంధీ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని.. దీనివల్ల అక్రమంగా ఓటర్ ఐడీ పొందినట్లు స్పష్టమవుతోందని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో న్యాయవాది వివరించారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు, ఈ ఆరోపణల్లో ఎటువంటి పస లేదని పేర్కొంటూ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సోనియా గాంధీతో పాటు, కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది.
బీజేపీ నేత పోస్ట్
కాగా 1983లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం వచ్చిందని.. 1980 నాటి ఓటరు జాబితా ఇది అంటూ గత నెలలో బీజేపీ నేత అమిత్ మాలవియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. గాంధీ కుటుంబీకులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీలతో పాటు సోనియా గాంధీ పేరును కూడా చేర్చారని పోస్ట్‌లో పేర్కొన్నారు.
అప్పటికీ సోనియా గాంధీ ఇంకా ఇటలీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని.. భారత పౌరసత్వంపై విమర్శలు రావడంతో 1982లో ఓటరు జాబితా నుంచి పేరు తొలగించి, 1983లో మళ్లీ చేర్చారని పోస్ట్‌లో వివరించారు. పౌరసత్వానికి ముందే ఓటరు జాబితాలో పేరు కనిపించడం ఎన్నికల ప్రక్రియ దుర్వినియోగం కాదా అని బీజేపీ నేత ప్రశ్నించారు. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
కాగా గత కొంతకాలంగా వివిధ అంశాలపై ఆమెపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు సోనియా గాంధీకి రాజకీయంగా మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. ఆమె పౌరసత్వం, ఓటు హక్కుపై గతంలోనూ అనేకసార్లు ఆరోపణలు రాగా.. తాజా ఈ తీర్పుతో ఆ వివాదాలకు తెర పడినట్లయింది. అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయంటూ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే.


