Post-mortem blood circulation restart : మరణం అంటే ముగింపు… శాశ్వత నిశ్శబ్దం. గుండె ఆగి, రక్త ప్రసరణ నిలిచిపోయాక దేహం నిర్జీవమవుతుంది. కానీ, ఆగిపోయిన దేహంలో మళ్లీ రక్త ప్రవాహాన్ని ప్రారంభిస్తే? ప్రాణం లేని అవయవాలకు తిరిగి జీవం పోయగలిగితే? ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు, మన దేశ రాజధాని దిల్లీలో భారత వైద్యులు సాధించిన అపూర్వ విజయం. ఆసియా ఖండంలోనే తొలిసారిగా, మరణించిన వ్యక్తి శరీరంలో రక్త ప్రసరణను పునరుద్ధరించి, అవయవాలను సేకరించి ముగ్గురికి ప్రాణం పోసి వైద్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. అసలు మరణించిన శరీరంలో ఇది ఎలా సాధ్యమైంది? ఈ అద్భుత ప్రక్రియ పేరు ఏమిటి? దీని వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఏంటి? ఈ ఘనత భారత వైద్య రంగానికి ఎలాంటి కొత్త దారులు చూపబోతోంది?
దేశ వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలిచే ఈ అరుదైన ఘనతకు దిల్లీ ద్వారకలోని హెచ్‌సీఎంసీటీ మణిపాల్ హాస్పిటల్ వేదికైంది. మృత్యువుతో పోరాడి ఓడిన ఓ మహిళ, తన మరణానంతరం కూడా ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపిన ఈ స్ఫూర్తిదాయక కథనం వైద్య శాస్త్రానికే కొత్త ఊపిరినిచ్చింది.
దశలవారీగా అద్భుతం ఆవిష్కరణ
విషాదకరమైన ఆరంభం: గీతా చావ్లా (55) అనే మహిళ, కండరాలను క్షీణింపజేసే అరుదైన ‘మోటార్ న్యూరాన్ డిసీజ్’ (Motor Neuron Disease) అనే వ్యాధితో పోరాడుతూ మంచానికే పరిమితమయ్యారు. నవంబర్ 5న శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆమెను కుటుంబ సభ్యులు మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు వైద్యులతో చర్చించి, కృత్రిమంగా లైఫ్ సపోర్ట్‌పై ఉంచకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 6, రాత్రి 8:43 గంటలకు గీతా చావ్లా గుండె ఆగిపోవడంతో, ఆమె మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
ఆశకు ఊపిరిపోసిన ‘NRP’ విధానం: జీవించి ఉన్నప్పుడు గీతా చావ్లా తన అవయవాలను దానం చేయాలనే గొప్ప సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ఆమె చివరి కోరికను గౌరవిస్తూ, వైద్యులు ఒక సాహసోపేతమైన ముందడుగు వేశారు. “నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూషన్” (Normothermic Regional Perfusion – NRP) అనే అత్యంత సంక్లిష్టమైన, వినూత్నమైన ప్రక్రియను చేపట్టారు.
యంత్ర సహాయంతో పునఃప్రసరణ: NRP అంటే, గుండె ఆగిపోయి, రక్త ప్రసరణ నిలిచిపోయిన (Donation after Circulatory Death – DCD) తర్వాత, యంత్రాల సహాయంతో శరీరంలోని కీలక అవయవాలకు తిరిగి రక్త ప్రసరణను అందించడం. ఇందుకోసం వైద్యులు “ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజినేటర్” (ECMO) అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. ఈ యంత్రం ఒక కృత్రిమ గుండె మరియు ఊపిరితిత్తిలా పనిచేసి, మృతదేహంలోని కాలేయం, మూత్రపిండాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేసింది. తద్వారా ఆ అవయవాలు దెబ్బతినకుండా సజీవంగా ఉండేలా చేసింది.
వైద్య నిపుణుల మాటల్లో : “భారత్‌లో సాధారణంగా బ్రెయిన్ డెత్ (జీవన్మృతుడు) అయిన వారి నుంచే అవయవాలు సేకరిస్తారు. ఆ స్థితిలో మెదడు పనిచేయకపోయినా, గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ సర్క్యులేటరీ డెత్ (DCD)లో గుండె ఆగిపోతుంది, కాబట్టి అవయవాలు దెబ్బతినకుండా రక్షించడానికి సమయమే కీలకం. NRP విధానంతో మేం ఆ సవాలును అధిగమించి, కాలేయం, మూత్రపిండాలను విజయవంతంగా భద్రపరిచాం. ఆసియాలో ఇలా చేయడం ఇదే తొలిసారి” అని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ తెలిపారు.
ముగ్గురికి కొత్త జీవితం : వైద్యులు అవయవాలను భద్రపరిచిన వెంటనే, జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (NOTTO) రంగంలోకి దిగి, అవసరమైన రోగులకు వాటిని కేటాయించింది.
గీతా చావ్లా కాలేయాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)లో 48 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా మార్పిడి చేశారు. ఆమె రెండు మూత్రపిండాలను 63 – 58 ఏళ్ల ఇద్దరు పురుషులకు సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో అమర్చారు.
భవిష్యత్తుకు సరికొత్త దిశ : “2024లో మన దేశంలో 1,128 మంది బ్రెయిన్ డెత్ దాతల ద్వారా అవయవదానం జరిగింది. ఈ సంఖ్యతో మనం ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉన్నాం. ఇప్పటి వరకు ఇది మాత్రమే మార్గం అనుకున్నాం. కానీ ఈ విజయంతో, ఇకపై గుండె ఆగి మరణించిన వారి నుంచి కూడా అవయవదానం సాధ్యమవుతుందని నిరూపితమైంది. భవిష్యత్తులో ఈ NRP విధానం ద్వారా గుండె, ఊపిరితిత్తులు వంటి సున్నితమైన అవయవాలను కూడా రక్షించవచ్చు. ఇది భారత వైద్యరంగానికి కొత్త దిశనిచ్చే ఆవిష్కరణ,” అని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ (కర్నల్) అవ్నీష్ సేథ్ పేర్కొన్నారు. గీతా చావ్లా కుటుంబం తీసుకున్న మానవతా నిర్ణయం, దానికి వైద్యులు జోడించిన సాంకేతిక నైపుణ్యం.. ఎందరో రోగులకు కొత్త ఆశను ఇచ్చింది. గీతా చావ్లా మరణం తర్వాత కూడా ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి, శాస్త్ర విజ్ఞానానికి మానవత్వపు చిరునామాగా నిలిచారు.


