FSSAI ORS trademark ban : పానీయాల ఉత్పత్తులపై ‘ORS’ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) అనే పదాన్ని వాడటంపై చెలరేగిన వివాదంలో, ప్రముఖ హైడ్రేషన్ డ్రింక్ ‘ORSL’ తయారీదారు జేఎన్‌టీఎల్ (JNTL) కన్స్యూమర్ హెల్త్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ‘ORS’ పదాన్ని ట్రేడ్‌మార్క్‌లలో వాడరాదంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అకస్మాత్తుగా జారీ చేసిన ఉత్తర్వుల అమలును, జేఎన్‌టీఎల్ విషయంలో నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈ వివాదానికి మూలమేంటి? FSSAI ఎందుకీ నిర్ణయం తీసుకుంది..?
‘ORS’ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ఫార్ములా ప్రకారం తయారయ్యే జీవన రక్షక ద్రావణం. అయితే, మార్కెట్లో అనేక పానీయాల కంపెనీలు తమ ఉత్పత్తుల పేర్లలో ‘ORS’ అనే పదాన్ని చేర్చి అమ్ముతున్నాయి. ఇది వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని భావించిన FSSAI, ఈ పదాన్ని సాధారణ ఎలక్ట్రోలైట్ పానీయాలకు వాడరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
జేఎన్‌టీఎల్ వాదన : FSSAI ఆకస్మిక నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ‘ORSL’ తయారీదారు జేఎన్‌టీఎల్ కన్స్యూమర్ హెల్త్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ముందస్తు నోటీసు లేదు: ఎలాంటి ముందస్తు నోటీసు, సంప్రదింపులు లేకుండా FSSAI ఏకపక్షంగా తమ పాత ఆదేశాలను ఉపసంహరించుకుందని వాదించింది.
భారీ నష్టం: ఈ నిర్ణయం వల్ల, సప్లయ్ చైన్‌లో ఉన్న సుమారు రూ.155-180 కోట్ల విలువైన తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని, ఇది తమ బ్రాండ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
చట్ట ఉల్లంఘన: వాటాదారులతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం తీసుకోవడం, గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు : జేఎన్‌టీఎల్ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ సచిన్ దత్తా, ఈ విషయంలో వారికి మధ్యంతర రక్షణ కల్పించారు.
“చట్టప్రకారం పిటిషనర్‌కు విచారణకు అవకాశం కల్పించి, తుది నిర్ణయం తీసుకునే వరకు, FSSAI జారీ చేసిన అభ్యంతరకరమైన ఉత్తర్వులను పిటిషనర్ విషయంలో అమలు చేయరాదు.”
– జస్టిస్ సచిన్ దత్తా, ఢిల్లీ హైకోర్టు
ఈ ఉత్తర్వులతో, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు జేఎన్‌టీఎల్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు (ఉత్పత్తుల స్వాధీనం, లైసెన్స్ సస్పెన్షన్ వంటివి) తీసుకోకుండా FSSAIకి అడ్డుకట్ట పడింది. ఈ కేసుపై FSSAI తన వైఖరిని పునఃపరిశీలించుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


