Monday, February 16, 2026
Homeనేషనల్Delhi High Court : బ్రిజ్ భూషణ్‌కు బిగ్ షాక్.. విచారణ ఆగదు, వాయిదాలు కుదరవు!

Delhi High Court : బ్రిజ్ భూషణ్‌కు బిగ్ షాక్.. విచారణ ఆగదు, వాయిదాలు కుదరవు!

Delhi High Court Ruling : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేసు విచారణను సాగదీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు దిల్లీ హైకోర్టు కళ్లెం వేసింది. పదే పదే వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తున్న తీరుపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గురువారం  జరిగిన విచారణలో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ కేసు ప్రొసీడింగ్స్‌పై ఎలాంటి స్టే  లేదు.. విచారణ ఆగదు” అని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో బ్రిజ్ భూషణ్ మెడపై చట్టం ఉచ్చు బిగుసుకుంటోందన్న చర్చ న్యాయవర్గాల్లో మొదలైంది. 

- Advertisement -

స్టే ఇచ్చేదే లేదు.. విచారణ కొనసాగాల్సిందే : మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసు విచారణపై స్టే విధించాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ తరపున దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు పరిశీలించింది. అయితే, విచారణ ప్రక్రియను నిలిపివేయడానికి న్యాయస్థానం ససేమిరా అంగీకరించలేదు. ట్రయల్ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో జోక్యం చేసుకోబోమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.

వాయిదాల పర్వంపై కోర్టు అసహనం : ఈ కేసులో బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాదులు పదే పదే వాయిదాలు  కోరడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విచారణను వాయిదా వేయాలని కోరడం సరికాదని న్యాయమూర్తి మందలించారు. ఇది న్యాయ ప్రక్రియను జాప్యం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది. “ఇప్పటికే చాలా సమయం వృధా అయ్యింది. ఇంకా వాయిదాల పేరుతో సాగదీయలేం” అని న్యాయస్థానం ఘాటుగా స్పందించింది.

నేపథ్యం ఇదీ : భారతదేశానికి పతకాలు సాధించిపెట్టిన ప్రముఖ మహిళా రెజ్లర్లు.. అప్పటి డబ్ల్యూఎఫ్ఐ (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విధితమే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అయితే, బ్రిజ్ భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కోర్టును ఆశ్రయించగా, తాజాగా హైకోర్టు ఆయనకు షాక్ ఇస్తూ విచారణ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దిగువ కోర్టులో బ్రిజ్ భూషణ్‌పై విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. బాధితులకు న్యాయం జరిగే దిశగా ఇది కీలక మలుపు అని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News