Sunday, November 16, 2025
Homeనేషనల్Delhi High Court: ప్రేమ హక్కు - పెళ్లి స్వేచ్ఛ! అడ్డుపడితే ఊరుకోం: హైకోర్టు ఘంటాపథం

Delhi High Court: ప్రేమ హక్కు – పెళ్లి స్వేచ్ఛ! అడ్డుపడితే ఊరుకోం: హైకోర్టు ఘంటాపథం

Delhi High Court On Love Marriage: ప్రేమించడం నేరమా..? ఇష్టపడి ఒక్కటవ్వడం తప్పా..? కన్నవాళ్లే కక్షగడితే ఆ ప్రేమ జంటకు దిక్కెవరు? ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతున్న ఎందరికో దిల్లీ హైకోర్టు భరోసానిచ్చింది. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోవడానికి మీరెవరంటూ కుటుంబ సభ్యులకే సున్నితంగా చురకలంటించింది. ఇంతకీ, కోర్టు తలుపు తట్టిన ఆ జంట కథేంటి..? వారి ప్రాథమిక హక్కులను కాపాడేందుకు న్యాయస్థానం జారీ చేసిన కీలక ఆదేశాలేమిటి..?

- Advertisement -

ప్రేమించి, పెద్దలను ఎదిరించి ఒక్కటైన జంటకు కలిసి జీవించే పూర్తి హక్కు ఉందని దిల్లీ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ప్రకారం, మేజర్లయిన యువతీయువకులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుని, శాంతియుతంగా జీవించే స్వేచ్ఛను ఎవరూ హరించలేరని తేల్చిచెప్పింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకత, సామాజిక ఒత్తిళ్లు వారి ప్రాథమిక హక్కులను కాలరాయలేవని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ నరులాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేసు పూర్వాపరాలివే : వివరాల్లోకి వెళితే, ఓ యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం లభించకపోవడంతో, యువతి ఇంటి నుంచి వచ్చేసి, 2025 జులై 23న దిల్లీలోని ఓ ఆర్యసమాజ్ మందిరంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కూతురు కనిపించడం లేదని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన అధికారులు ఆమె తన ఇష్టపూర్వకంగానే వెళ్లి పెళ్లి చేసుకుందని, ప్రస్తుతం సంతోషంగా ఉందని నిర్ధారించుకుని కేసును మూసివేశారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/swachh-vidyalaya-puraskar-2025-26-application-guidelines/

తప్పని పెద్దల వేధింపులు : పోలీసులు కేసును ముగించినప్పటికీ, అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు ఆగలేదు. దీంతో, తమకు ప్రాణరక్షణ కల్పించాలంటూ నవ దంపతులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, వారి భయానికి తగిన ఆధారాలున్నాయని నిర్ధారించుకుంది.

కోర్టు ఆదేశాలు ఇవే..
ప్రేమ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ, జస్టిస్ నరులా పలు కీలక సూచనలు జారీ చేశారు.స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఈ జంట భద్రతకు పూర్తి బాధ్యత వహించాలి.

ALSO READ: https://teluguprabha.net/national-news/mallikarjun-kharge-criticizes-bjp-independence-day-2025/


వారి నివాస ప్రాంతంలోని బీట్ కానిస్టేబుల్‌కు వీరి వివరాలు అందించి, నిరంతరం పర్యవేక్షించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి SHO మరియు బీట్ కానిస్టేబుల్ ఫోన్ నంబర్లను ఆ జంటకు అందజేయాలి. వారి నుంచి ఎలాంటి బెదిరింపులకు సంబంధించిన ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

గతంలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసుల్లో ఇదే విధమైన తీర్పులు ఇచ్చిందని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ కేసులో తాము కేవలం ఆ జంట ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి మాత్రమే రక్షణ కల్పిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad