Delhi High Court: పచ్చని దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ఎంట్రీ.. వారి వివాహ బంధాన్ని ఎంతగా ఛిన్నాభిన్నం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. వివాహేతర సంబంధాల మోజులో పడి జీవిత భాగస్వామిని అంతం చేయడం లేదంటే వారి నుంచి విడిపోవడం ఇలా ఎన్నో దుర్ఘటనలు సమాజంలో వివాహ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి..
Also Read: https://teluguprabha.net/national-news/viksit-young-leaders-dialogue-competition-meet-pm-modi/
తమ వివాహ బంధాన్ని ముక్కలు చేసి, దంపతుల మధ్య ప్రేమను దెబ్బతీసిన తన జీవిత భాగస్వామికి చెందిన కొత్త భాగస్వామి నుంచి భర్త లేదా భార్య నష్టపరిహారాన్ని కోరవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 15న విచారణ జరిపిన జస్టిస్ పురుషేంద్ర కౌరవ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. వివాహేతర సంబంధం అనేది ఇప్పుడు నేరం కాదని.. కాని దాని పర్యవసానాలు మాత్రం ప్రమాదకరంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. వివాహ పవిత్రతపై సమాజంలో కొన్ని అంచనాలు ఉంటాయని చెప్పారు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవడం నేరం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించి శిక్షించలేమని జస్టిస్ పురుషేంద్ర కౌరవ్ పేర్కొన్నారు, కానీ వాటి ద్వారా జీవితానికి, హక్కులకు ప్రమాదకరంగా పరిణమించగలదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జోసెఫ్ షైన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన జస్టిస్.. వివాహేతర సంబంధాలను నేరరహితంగా ప్రకటించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అయితే వివాహేతర సంబంధాలకు సర్వోన్నత న్యాయస్థానం లైసెన్సు కూడా ప్రకటించలేదని కూడా ఆయన గుర్తు చేశారు.
ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. కాగా, వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసినందుకు జీవిత భాగస్వామికి చెందిన కొత్త భాగస్వామి నుంచి ఆర్థిక పరిహారం పొందే మొదటి కేసుగా ఇది నిలుస్తుందనడంలో సందేహ లేదు.


