యోగా గురు బాబా రామ్‌దేవ్(Baba Ramdev)పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్‌దర్ద్ సంస్థకు చెందిన ‘రూహ్ అఫ్జా’ శీతల పానీయం గురించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీరియస్ అయింది. రామ్‌దేవ్ సొంత లోకంలో జీవిస్తున్నట్లుందని.. ఆయన ఎవరి నియంత్రణలో లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాల్సి వస్తుందని జస్టిస్ అమిత్ బన్సల్ హెచ్చరించారు.
పతంజలికి చెందిన గులాబ్ షర్బత్‌ను ప్రమోట్ చేస్తూ ‘రూహ్ అఫ్జా’ పానీయంపై ‘షర్బత్ జిహాద్’ తరహా వ్యాఖ్యలు చేశారని హమ్‌దర్ద్ నేషనల్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వ్యవహారంపై మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రామ్‌దేవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.