Kailash Gahlot| వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారీ షాక్ తగిలింది. రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు లేఖ పంపారు.
అతిశీ ప్రభుత్వం అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని.. హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆప్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం ఆప్ ప్రభుత్వంలో హోం, రవాణా, ఐటి, మహిళలు, శిశుసంక్షేమ శాఖలతో పాటు కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఆప్ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తన పార్టీని గెలిపించినప్పుడే సీఎం పదవి స్వీకరిస్తానని తెలిపారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత అతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.