Homeనేషనల్Delhi: సీజేపీ నిరసనలు.. ఢిల్లీలో హై అలర్ట్..

Delhi: సీజేపీ నిరసనలు.. ఢిల్లీలో హై అలర్ట్..

న్యూఢిల్లీ, అక్టోబర్ 9 (తెలుగు ప్రభ): అక్టోబర్ 10న సీజేపీ (CJP) నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసు, పారా మిలటరీ బలగాలను మోహరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ నుంచి సుమారు 7 వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఢిల్లీకి తరలించారు. అత్యాధునిక అల్లర్ల నిరోధక ఆయుధాలతో బలగాలను సిద్ధం చేశారు.

- Advertisement -

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ తలపెట్టిన నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఢిల్లీ నగరవ్యాప్తంగా 20 వేల మందికిపైగా పోలీసు, పారా మిలటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ సరిహద్దుల్లో నిఘా పెంచి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

నిరసనల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించేలా తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపైనా నిఘా కొనసాగిస్తున్నారు. మరోవైపు, అక్టోబర్ 10న నిరసనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రద్దీ, ఆంక్షలు ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు. అక్టోబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా, రాజధానిలో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమావేశమైన ఆయన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్రాల పర్యటనలను సైతం రద్దు చేసుకున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News