Delhi Stray Dog Shelter Cost : వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఓ కొత్త సంక్షోభానికి దారితీస్తోంది. దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లోని పది లక్షల శునకాలకు శాశ్వత ఆశ్రయాలు కల్పించాలంటే.. రోజుకు అయ్యే ఖర్చు అక్షరాలా రూ.11 కోట్లు! ఈ భారీ అంచనా చూసి దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంత భారీ మొత్తాన్ని ఎలా సమీకరించాలి..? ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎంసీడీ ఈ భారాన్ని మోయగలదా..? అసలు ఈ సమస్యకు మూలమెక్కడ..?
ఆదేశం సరే.. నిధులెక్కడ : దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వంటి ఐదు నగరాల్లో తక్షణమే చెరో 5వేల వీధి కుక్కలకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఆరు నుంచి ఎనిమిది వారాల్లోగా ఈ పని పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో ఎంసీడీ అధికారులు కుక్కలను పట్టే పనిని ప్రారంభించారు. తొలి విడతగా మనుషులను కరిచే, వ్యాధిగ్రస్తమైన శునకాలను తరలించాలని నిర్ణయించారు. వాటి కోసం ఘోఘా డైరీ ప్రాంతంలో 80 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్థలాలు దొరికాయి సరే, మరి నిధుల మాటేమిటి? అనే ప్రశ్న ఇప్పుడు వారిని వేధిస్తోంది.
ఖర్చుల లెక్క ఇదే : అధికారులు వేసిన అంచనాల ప్రకారం, ఒక్కో కుక్క పోషణకు, సంరక్షణకు రోజుకు కనీసం రూ.110 ఖర్చవుతుంది. ఇందులో వాటి ఆహారం, నీరు, వైద్యం, పారిశుధ్యం, షెల్టర్ల విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు వంటివన్నీ పెరిగాయి.
ఒక్క కుక్కపై రోజువారీ ఖర్చు: రూ. 110
10 లక్షల కుక్కలపై రోజువారీ ఖర్చు: రూ. 11 కోట్లు
ఈ లెక్కన, దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని 10 లక్షల వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలిస్తే, వాటి నిర్వహణకే రోజుకు రూ.11 కోట్లు, నెలకు రూ.330 కోట్లు, ఏడాదికి సుమారు రూ.4,015 కోట్లు ఖర్చవుతుంది.
ఎంసీడీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే : వాస్తవానికి, ఇంతటి భారీ భారాన్ని మోసే స్థితిలో ఎంసీడీ లేదు. ఇప్పటికే కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల జీతాలు, వారి ప్రయోజనాలు, రుణాల చెల్లింపులు వంటి అనేక బకాయిలతో సంస్థ సతమతమవుతోంది. వీధి కుక్కల సంరక్షణకు రోజుకు కోట్లాది రూపాయలు వెచ్చించే విషయం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో రోజుకు 350 కుక్కలను పట్టి, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ఖర్చు సుమారు రూ.1000) చేసి, పది రోజుల్లో వదిలేసేవారు. కానీ, సుప్రీం తాజా ఆదేశాలతో వాటిని శాశ్వతంగా షెల్టర్లలోనే ఉంచాల్సి ఉంటుంది. ఇది ఎంసీడీపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపనుంది.


