Delhi AI morphing teacher arrest : ఢిల్లీలో ఓ 22 ఏళ్ల మాజీ టీచర్ చేసిన దారుణం అందరినీ షాక్‌కు గురి చేసింది. స్కూల్ ప్రిన్సిపాల్‌పై తీవ్రమైన వన్‌సైడ్ లవ్ పెంచుకున్న ఆమె, తన ప్రేమకు అడ్డుగా భావించిన సహోద్యోగి టీచర్‌పై కక్ష పెంచుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ సాయంతో ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్ఫ్ చేసి, నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పోస్ట్ చేసి పరువు తీసింది. ఈ ఘటనపై ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితురాలిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 12, 2025న పాత ఢిల్లీలో ఆమెను పట్టుకున్నారు.
ALSO READ: Mallanna Sagar : ఆస్తులు లాగారు.. అవస్థలు మిగిల్చారు! మల్లన్నసాగర్ నిర్వాసితుల కన్నీటి గాథ!
బాధితురాలు 25 ఏళ్ల టీచర్. ఆమె ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్‌లో పని చేస్తోంది. తన పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు సృష్టించి, మార్ఫ్ చేసిన అసభ్య ఫొటోలు పోస్ట్ చేసి, స్కూల్ విద్యార్థులు, సిబ్బందికి ఫాలో రిక్వెస్ట్‌లు పంపుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇన్‌స్పెక్టర్ రోహిత్ గహ్లోత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఐపీ అడ్రస్‌లు, రిజిస్టర్డ్ ఈమెయిల్స్ వంటి సాంకేతిక ఆధారాలు సేకరించింది.
దర్యాప్తులో నిందితురాలు 2022 వరకు అదే స్కూల్‌లో కాంట్రాక్ట్ సంస్కృత టీచర్‌గా పని చేసినట్లు తెలిసింది. ప్రిన్సిపాల్ ఆమెకు గతంలో గురువు. ఆయనపై తీవ్రమైన వ్యామోహం పెంచుకుంది. ఆయన దృష్టి ఆకర్షించడానికి తనకు క్యాన్సర్ ఉందని, చివరికి తాను చనిపోయినట్లు కూడా నాటకాలు ఆడింది. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో బాధితురాలు ప్రిన్సిపాల్‌తో సన్నిహితంగా ఉంటోందని భావించి ఆమెపై అసూయ పెంచుకుంది. ప్రతీకారంగా AI టూల్స్‌తో ఫొటోలు మార్ఫ్ చేసి, నకిలీ అకౌంట్లలో పోస్ట్ చేసింది. ఇది ఆమె పరువును దెబ్బతీయడమే లక్ష్యంగా చేసింది.
అంతేకాక, నిందితురాలు క్షుద్రపూజల వైపు మొగ్గు చూపింది. ఆమె దగ్గర నుంచి పోలీసులు కొన్ని చేతిరాత చీటీలు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై వింత గుర్తులు, అంకెలు, తన పేరు, ప్రిన్సిపాల్ పేరు రాసి ఉన్నాయి. ఇది ఆమెలోని తీవ్రమైన ఆబ్సెషన్‌ను చూపిస్తోంది. విచారణలో ఆమె ఈ విషయాలన్నీ అంగీకరించింది. పోలీసులు ఈ కేసును AI దుర్వినియోగానికి ఉదాహరణగా చూపుతున్నారు.
ఈ ఘటన సైబర్ క్రైమ్‌లపై అప్రమత్తతను పెంచింది. AI టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఈ కేసు తెలియజేస్తోంది. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిందితురాలిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.


