Delhi Fuel Ban Effect Car Prices: జులై 1, 2025 నుంచి దేశ రాజధాని దిల్లీలో అమల్లోకి వచ్చిన నూతన వాహన పాలసీ, ముఖ్యంగా పాత వాహనాల యజమానులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పదేళ్లుగా వాడుతున్న డీజిల్, 15 ఏళ్లుగా వాడుతున్న పెట్రోల్ వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. అప్పటివరకు వాడుతున్న తమ పాత కార్లను ఏం చేయాలో తెలియక చాలా మంది సతమతమయ్యారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు, దిల్లీ వెలుపల ఉన్న వ్యక్తులు తక్కువ ధరలకే పాత కార్లను కొనుగోలు చేశారు.
లక్షల విలువైన కార్లు నామమాత్రపు ధరలకే విక్రయం: ఈ ఇంధన నిషేధం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, లక్షల విలువైన కార్లు నామమాత్రపు ధరలకే అమ్ముడుపోయాయి. దిల్లీ వాసి నితిన్ గోయల్ తన రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కేవలం రూ.8 లక్షలకే అమ్మివేయాల్సి వచ్చింది. అదేవిధంగా, రూ.40 లక్షల విలువైన మెర్సిడెస్ సి-క్లాస్ 220 సిడిఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే విక్రయించారు. రితేశ్ గందోత్ర అనే మరో దిల్లీ వాసి తన రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీని “నామమాత్రపు రేటుకే” అమ్మివేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఎన్‌జీటీ ఆదేశాల అమలు – ప్రభుత్వ పునరాలోచన : దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) 2014లోనే పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోల్ వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ ఎన్‌జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జూలై 1 నుండి ఇంధన సరఫరా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే, వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో దిల్లీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజలు సంతోషంగా లేరని, అమలులో సవాళ్లు ఎదురవుతున్నాయని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా అంగీకరించారు. గడువు తీరిన వాహనాలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయమై వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని కనుగొంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.