సాధారణంగా వివాహ వేడుకలంటే.. ఇల్లంతా సందడిగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు ఆట, పాటలతో సరదాగా గడుపుతారు. అయితే ఓ వివాహంలో వరుడికి ఊహించని తగిలింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేయగా.. చివరికి ఆ వివాహమే రద్దు అయిపోయింది. ఢిల్లీలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసలు అక్కడ ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు అందరూ రావడంతో.. ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వివాహ వేడుకకు పెళ్లి ఊరేగింపుగా వరుడు వచ్చాడు. అయితే అక్కడే జరిగింది ఓ ట్విస్ట్. వరుడి ఫ్రెండ్స్ అతని కొంప ముంచారు. సరదాగా తనతో డ్యాన్స్ చేయమని అతడిని కోరారు. స్నేహితులు అడిగారని అతడు డ్యాన్స్ వేశాడు. అది కూడా బాలీవుడ్‌లోని ‘ఛోలీ కే పీచే క్యా హై’ అనే పాటకు రెండు స్టెప్పులు వేశాడు.
అయితే అతని డ్యాన్స్ చూసిన పెళ్లికూతురు, ఆమె తండ్రి చూసి షాక్ అయ్యారు. వరుడి స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వివాహాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నిమిషాల వ్యవధిలోనే అతడి డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడి డ్యాన్స్ కుటుంబ విలువలను దిగజార్చే విధంగా ఉన్నాయంటూ కథనాలు వచ్చేశాయి. అయితే వరుడు తన డ్యాన్స్ పై వివరణ ఇచ్చాడు. ఇదంతా సరదా కోసమే చేశానని చెప్పినా ఫలితం లేకుండా పోయింది.
పెళ్లికూతురు తండ్రి మాత్రం ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. వధువు కూడా అనూహ్యంగా కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి రద్దు చేసి మంచి పని చేశారంటూ కొంతమంది సపోర్ట్ చేస్తుంటే.. పెళ్లిలో డ్యాన్స్ చేయడం సహజమని.. కానీ వివాహాన్ని రద్దు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.