Fake Godman Chaitanyananda Saraswati Hidden Cameras: ఆధ్యాత్మిక గురువు ముసుగులో ఓ నకిలీ బాబా దశాబ్దాలుగా సాగించిన వికృత క్రీడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న ప్రముఖ ‘శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్’ డైరెక్టర్, స్వామి చైతన్యానంద సరస్వతి (62) అలియాస్ పార్థసారథి.. ఏకంగా 17 మందికి పైగా విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ కామాంధుడి కోసం ఢిల్లీ పోలీసులు ఐదు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.
వికృత చేష్టల చిట్టా..
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి స్కాలర్‌షిప్‌లపై చదువుకుంటున్న విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని ఈ బాబా తన రాక్షస క్రీడను కొనసాగించాడు. పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఇతని అకృత్యాల చిట్టా చాలా పెద్దది:
- రహస్య కెమెరాలు: మహిళల హాస్టల్‌లో భద్రత పేరు చెప్పి రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి, వారి కదలికలను నిత్యం గమనించేవాడు.
- అర్ధరాత్రి వేధింపులు: విద్యార్థినులను అర్ధరాత్రి తన గదికి పిలిపించుకుని, అసభ్యంగా ప్రవర్తించేవాడు. విదేశీ పర్యటనలకు తనతో పాటు రావాలని బలవంతం చేసేవాడు.
- అసభ్యకర సందేశాలు: విద్యార్థినులకు “బేబీ, ఐ లవ్ యూ”, “నువ్వు చాలా అందంగా ఉన్నావు” వంటి అసభ్యకర సందేశాలను వాట్సాప్ ద్వారా పంపేవాడు. స్పందించకపోతే మార్కులు తగ్గిస్తానని, డిగ్రీలు ఆపేస్తానని బెదిరించేవాడు.
- మహిళా సిబ్బంది సహకారం: ఇన్‌స్టిట్యూట్‌లోని అసోసియేట్ డీన్ శ్వేత సహా ముగ్గురు మహిళా సిబ్బంది, ఈ బాబాకు సహకరిస్తూ విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చేవారని బాధితులు ఆరోపించారు.
- నకిలీ నంబర్ ప్లేట్: దౌత్యవేత్తలు వాడే నకిలీ నంబర్ ప్లేట్ (39 UN 1) ఉన్న వోల్వో కారును ఉపయోగించేవాడు. పోలీసులు దీన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
బూటకపు ప్రచారంతో బురిడీ..
చైతన్యానంద కేవలం కామాంధుడే కాదు, ఓ పెద్ద మోసగాడు కూడా. తాను చికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, పీహెచ్‌డీ చేశానని, ఏకంగా 28 పుస్తకాలు, 143 పరిశోధనా పత్రాలు రాశానని ప్రచారం చేసుకున్నాడు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తన పుస్తకానికి ముందుమాట రాశారని, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో ఉటంకించారని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ ప్రచారమంతా బూటకమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ALSO READ: Narendra Modi: జీఎస్టీపై కాంగ్రెస్ అసత్య ప్రచారం.. యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బయటపడింది ఇలా..
ఈ బాబా అకృత్యాలు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నా, ఇటీవల ఓ పూర్వ విద్యార్థిని ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యానికి రాసిన లేఖతో గుట్టురట్టయింది. ఆ మరుసటి రోజే, భారత వాయుసేనకు చెందిన ఓ ఉన్నతాధికారి నుంచి కూడా ఫిర్యాదు రావడంతో యాజమాన్యం మేల్కొంది. విద్యార్థినుల నుంచి 300 పేజీల సాక్ష్యాలను సేకరించి పోలీసులకు అప్పగించింది. దీంతో ఇతని పాపం పండింది. కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం కూడా చైతన్యానందతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ప్రస్తుతం పోలీసులు ఇతనిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసి, దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకున్నారు.


