Sabarimala Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవలి కాలంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. సోమవారం ఒక్కరోజే దర్శనానికి 1,07,260 మంది అయ్యప్ప భక్తులు బుకింగ్స్ చేసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆలయంలో రద్దీ పెరిగింది.
ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవలి కాలంలో శబరిమలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. రోజూ వేల సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనానికి వస్తున్నారు.
సోమవారం లక్ష మందికిపైగా దర్శించుకోనున్నారు. తాజా సీజన్‌లో లక్ష మందికిపైగా భక్తులు దర్శించుకోనుండటం ఇది రెండోసారి. భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి బుకింగ్ చేసుకుని ఉండటంతో పోలీసులు అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. పంపా నుంచి సన్నిధానం వరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. భక్తుల్ని నియంత్రించే క్రమంలో కొందరు పోలీసులు కూడా గాయాలపాలవుతున్నారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వంతోపాటు కేరళ హైకోర్టు కూడా స్పందించింది. ఆదివారం ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చించింది.
భక్తుల రద్దీ దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే మరో గంట వరకు భక్తులకు అదనంగా దర్శన సౌకర్యం కల్పించాలని దేవస్థాన బోర్డుకు సూచించింది. అలాగే తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, కలెక్టర్‌ను ఆదేశించింది. జస్టిస్ అనిల్ కె.నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్ ఆధ్వర్యంలోని బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమవుతోంది.