Aviation safety compliance : వందలాది ప్రయాణికుల ప్రాణాలను గాల్లో మోసుకెళ్లే విమానాలకు పైలట్లే ప్రాణం. వారి నైపుణ్యం, శిక్షణపైనే అందరి భద్రత ఆధారపడి ఉంటుంది. అలాంటి కీలకమైన శిక్షణలోనే డొల్లతనం బయటపడితే..? దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఏకంగా 1700 మంది పైలట్ల శిక్షణ విషయంలో ఇదే జరిగిందని ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ డీజీసీఏ గుర్తించింది. ఈ పరిణామం ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. అసలు ఇండిగో శిక్షణలో బయటపడిన లోపాలేమిటి..? అత్యంత క్లిష్టమైన విమానాశ్రయాలకు విమానాలు నడిపే పైలట్ల విషయంలో జరిగిన ఈ తప్పిదం ఎంత తీవ్రమైనది..? దీనిపై డీజీసీఏ తీసుకున్న చర్యలేమిటి..?
డీజీసీఏ కొరడా : ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గట్టి షాకిచ్చింది. సుమారు 1700 మంది పైలట్లకు ఇచ్చిన సిమ్యులేటర్ శిక్షణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని తేల్చిచెబుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత నెలలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సమర్పించిన రికార్డులు, సమాధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నోటీసులపై ఇండిగో యాజమాన్యం నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.
లోపం ఎక్కడుందంటే : విమానయానంలో కొన్ని విమానాశ్రయాలను ‘కేటగిరీ-సి’ లేదా ‘క్రిటికల్ ఎయిర్‌ఫీల్డ్స్’గా వర్గీకరిస్తారు. లేహ్, కాలికట్, ఖాట్మండ్ వంటి విమానాశ్రయాలు ఈ కోవలోకి వస్తాయి. కొండల మధ్య ఉండటం, వాతావరణ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉండటం వంటి కారణాల వల్ల ఇక్కడ విమానాలను ల్యాండింగ్, టేకాఫ్ చేయడానికి పైలట్లకు అత్యంత ప్రత్యేకమైన, కఠినమైన శిక్షణ అవసరం. ఇండిగోకు చెందిన కమాండర్లు, ఫస్ట్ ఆఫీసర్లు కలిపి మొత్తం 1700 మంది పైలట్లకు ఈ ‘కేటగిరీ-సి’ శిక్షణ ఇచ్చారు.
అయితే, ఈ శిక్షణ కోసం ఉపయోగించిన సిమ్యులేటర్లు (విమానాన్ని నడిపినట్లే అనుభూతినిచ్చే కృత్రిమ యంత్రాలు) ఆ ప్రమాణాలకు ఏమాత్రం అర్హత లేనివని డీజీసీఏ తన తనిఖీల్లో గుర్తించింది. అర్హత లేని సిమ్యులేటర్లతో ఇచ్చిన శిక్షణ లోపభూయిష్టంగా ఉంటుందని, ఇది ప్రయాణికుల భద్రతకు పెను ప్రమాదమని డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం సరిపోలని శిక్షణతో పైలట్లను క్లిష్టమైన ఎయిర్‌పోర్టులకు పంపడం నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇండిగో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


