Dharali flood cause : కేవలం 30 సెకన్లు.. కనురెప్ప మూసి తెరిచేలోగా ఓ అందమైన పర్వత గ్రామం మట్టిలో కలిసిపోయింది. ఉత్తరాఖండ్‌లోని ధరాలీలో సంభవించిన ప్రళయం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ అది కుండపోత (క్లౌడ్‌బరస్ట్) వల్లే జరిగిందని భావిస్తున్న వేళ, అసలు కారణం వేరే ఉందంటూ భారత భూవిజ్ఞాన శాస్త్రవేత్త విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.? ఆ హిమకుప్పల వెనుక దాగిన రహస్యమేంటి..? కేవలం నిమిషం లోపే అంతటి విలయం ఎలా సంభవించింది..?
ధరాలీ విపత్తుకు కేవలం భారీ వర్షం మాత్రమే కారణం కాదని, దానికి ఒక ‘గ్లేసియర్ డిపాజిట్’ (Glacial Deposit) విచ్ఛిన్నం తోడవడమే ఇంతటి విధ్వంసానికి దారితీసిందని ప్రముఖ భారత భూవిజ్ఞాన శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఆయన చేసిన ప్రాథమిక విశ్లేషణ, ఈ విపత్తు తీవ్రతకు గల అసలు కారణాన్ని కళ్లకు కట్టింది. సుమారు 360 మిలియన్ క్యూబిక్ మీటర్ల శిథిలాలు ఒక్కసారిగా ఎలా కూలాయో ఆయన వివరించారు.
అసలేంటి ఈ ‘గ్లేసియర్ డిపాజిట్’ : సాధారణ భాషలో చెప్పాలంటే, హిమానీనదాలు (మంచు నదులు) కదిలేటప్పుడు తమతో పాటు రాళ్లు, మట్టి, కంకర వంటి వాటిని మోసుకువస్తాయి. కాలక్రమేణా ఆ మంచు కరిగిపోయినప్పుడు, అది మోసుకొచ్చిన ఈ శిథిలాలన్నీ ఒకేచోట గుట్టగా పేరుకుపోతాయి. ఈ సహజసిద్ధమైన, అస్థిరమైన మట్టి, రాళ్ల గుట్టలనే ‘గ్లేసియర్ డిపాజిట్లు’ అంటారు. ఇవి చూడటానికి మామూలు కొండల్లాగే ఉన్నా, వాటికి పట్టు తక్కువ.
ధరాలీలో జరిగింది ఇదే: శాస్త్రవేత్త ఇమ్రాన్ ఖాన్ విశ్లేషణ ప్రకారం, ధరాలీలో జరిగింది ఇదే.
భారీ హిమశిథిలాల రాశి: ధరాలీ గ్రామం నుంచి 7 కిలోమీటర్ల దూరన 6,700 మీటర్ల ఎత్తులో సుమారు 1.12 చదరపు కి. మి విస్తీర్ణంలో, 300 మీటర్ల మందంతో ఒక భారీ గ్లేసియర్ డిపాజిట్ ఉంది.
కుండపోత వర్షం: ఆగస్టు 5న ఆ ప్రాంతంలో కుండపోత వర్షం (క్లౌడ్‌బరస్ట్) కురిసింది. ఈ భారీ వర్షపు నీరు, ఆ గ్లేసియర్ డిపాజిట్‌లోకి చేరి దాని స్థిరత్వాన్ని దెబ్బతీసింది.
కూలిన కొండ: నీటి ఒత్తిడికి తట్టుకోలేక, ఆ మట్టి-రాళ్ల గుట్ట ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో వర్షపు నీటితో పాటు లక్షల టన్నుల శిథిలాలు కలిసిపోయి, ఓ బురద ప్రళయంగా మారాయి.
క్షణాల్లో విధ్వంసం: ఆ ప్రాంతంలోని లోయ నిటారుగా ఉండటంతో, ఈ శిథిలాల ప్రవాహం అత్యంత వేగంగా, కేవలం నిమిషం లోపే ధరాలీ గ్రామాన్ని చేరుకుని, సర్వనాశనం చేసింది.
శాస్త్రవేత్త హెచ్చరికలు – భవిష్యత్తుకు మార్గదర్శకాలు: ఈ ఘటన హిమాలయ ప్రాంతాల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ఉండటానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు.
నది ఒడ్డున, ఇలాంటి శిథిలాల ప్రవాహ మార్గాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.
ప్రమాదకర ప్రాంతాలలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను (Early Warning Systems) ఏర్పాటు చేయాలన్నారు. హిమాలయాల్లోని ఇలాంటి గ్లేసియల్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ అధ్యయనం అత్యవసరమని పేర్కొన్నారు.
ధరాలీ ఘటన ఒక గుణపాఠం : కేవలం వాతావరణ మార్పులనే కాకుండా, హిమాలయాల భౌగోళిక సున్నితత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, అభివృద్ధి ప్రణాళికలు, పర్యాటక కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ విపత్తు నొక్కి చెబుతోంది.


