Dharmasthala : కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో సామూహిక హత్యలు, అత్యాచారాలు, శవాల ఖననం జరిగాయని సంచలన ఆరోపణలు చేసిన సీఎన్ చిన్నయ్య అలియాస్ భీమా అబద్ధాలకోరని తేలింది. మాండ్యా జిల్లా చిక్కబళ్లి గ్రామానికి చెందిన చిన్నయ్యను పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటీ) అరెస్ట్ చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమని, డబ్బు కోసం కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. చిన్నయ్య మాజీ భార్య రత్నమ్మ మీడియాతో మాట్లాడుతూ, అతడు అబద్ధాలు చెప్పడంలో నిపుణుడని, డబ్బు కోసం ఈ వివాదాన్ని సృష్టించి ఉంటాడని ఆరోపించింది.
ALSO READ: KTR : ‘దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి’.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్!
1999లో చిన్నయ్యను పెళ్లి చేసుకున్న రత్నమ్మ, 2006లో విడాకులు తీసుకుంది. చిన్నయ్య తనను కొట్టేవాడని, విడాకుల సమయంలో కోర్టులో నిరుద్యోగినని అబద్ధం చెప్పి భరణం ఎగ్గొట్టాడని తెలిపింది. ధర్మస్థలలో 1995-2014 మధ్య స్వీపర్‌గా పనిచేసిన చిన్నయ్య, ఆ కాలంలో 70-80 శవాలను పాతానని, అవి అత్యాచార బాధిత మహిళలవని ఆరోపించాడు. ఎస్‌ఐటీ 17 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టినా, కేవలం ఒక మగ శవం, కొన్ని ఎముకలు మాత్రమే లభించాయి. ఫోరెన్సిక్ పరీక్షల్లో చిన్నయ్య ఇచ్చిన పుర్రె పురుషుడిదని తేలింది, ఆయన వాదనలు తప్పని నిర్ధారణ అయింది.
స్థానికుల ప్రకారం, చిన్నయ్య ధర్మస్థలలో మూడు పెళ్లిళ్లు చేసుకుని, అన్నీ విఫలమయ్యాయి. డబ్బు కోసం ఏదైనా చేసే స్వభావం ఉన్నాడని గ్రామస్థులు తెలిపారు. 2024లో స్వగ్రామానికి తిరిగొచ్చిన అతడు, పంచాయతీ భూమి కోసం గొడవ పెట్టుకున్నాడు. ఎస్‌ఐటీ విచారణలో చిన్నయ్య తన ఆరోపణలు కొందరి ఒత్తిడితో చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసు ధర్మస్థల ఆలయ పవిత్రతను మసిపూసే ప్రయత్నంగా భావిస్తున్నారు.


