తెలుగు రాష్ట్రాల్లో పలు రకాల వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ఫ్లూ, న్యుమోనియా లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇదే సమయంలో డెంగ్యూ, కొవిడ్ కూడా విజృంభించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ఏ వ్యాధి ఎటు నుంచి వస్తుందో తెలియక.. దాన్నుంచి తప్పించుకోవడం ఎలాగో అర్థం కాక తల పట్టుకోవాల్సి వస్తోంది.
ఇన్‌ఫ్లూయెంజా, న్యుమోనియా వ్యాధులు ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వీటివల్ల ఇప్పటికే పలువురు వెంటిలేటర్ల మీద ఉండగా.. కొంతమందికి ఎక్మో సైతం పెట్టాల్సి వస్తోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని, ఎక్మో పెట్టాల్సిన కేసులు కొన్ని వస్తున్నాయి. ఇది చాలా ఖరీదైన చికిత్స కావడంతో రోగుల కుటుంబాలు ఏమీ తేల్చుకోలేక సతమతం అవుతున్నాయి. డెంగ్యూ కూడా ఇదే సమయంలో తీవ్రంగా వస్తోంది. ప్లేట్‌లెట్ల కౌంటు ఒక్కసారిగా పడిపోవడం, ఒంటిమీద దద్దుర్లు రావడం లాంటి సమస్యల ఉండటంతో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పలువురు ఆస్పత్రులలో చేరాల్సి వస్తోంది.
ఇంకా ఇదే సమయంలో కొవిడ్‌లో కొత్త వేరియంట్ జెఎన్.1 కూడా విజృంభిస్తోంది. దీని గురించే ప్రపంచమంతా ఆలోచిస్తోంది. మళ్లీ మాస్కులు పెట్టుకోవాలా? భౌతికదూరం పాటించాలా? ఈ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత ఎంతగా ఉంటుంది? ఎలాంటి మందులు వాడాలి?…. ఇలాంటి అనేక అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. వీటి గురించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని గ్రీన్ టెంపుల్టన్ కాలేజిలో సీనియర్ ఫెలోగా ఉన్న ప్రొఫెసర్ జమీల్ తన విశ్లేషణ తెలిపారు. దీని విషయంలో అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆయన అంటున్నారు. ఇది బిఎ.2.86 వేరియంట్‌లో ఒక సబ్ లైనేజ్ అని ఇందులో అదనపు మ్యుటేషన్ ఉండటం వల్ల ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పారు.
ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు (కోమార్బిడిటీలు) ఉన్నవారు, కాస్త పెద్దవయసులో ఉన్నవాళ్లు మాత్రం జాగ్రత్తలు పాటించాలని జమీల్ హెచ్చరించారు. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కొవిడ్ సోకకుండా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
ఒకవైపు శీతాకాలం చలిగాలులు ఎక్కువకావడం, మరోవైపు వాయుకాలుష్యం కూడా ఉండటంతో పెద్దవాళ్లు, అనారోగ్య పీడితులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వీటివల్ల సాధారణంగానే రోగనిరోధక శక్తి తగ్గుతుందని, ఇలాంటి సందర్భంలో జెఎన్.1 చాలా సులభంగా వ్యాపిస్తుందని ప్రొఫెసర్ జమీల్ విశ్లేషించారు. భారతదేశంలో ప్రధానంగా తీసుకున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు ఇప్పటికే కొవిడ్ నుంచి రక్షణ కల్పిస్తున్నందున.. ఈ రకానికి కూడా చాలావరకు రక్షణ కల్పించే అవకాశం ఉందంటున్నారు.
అవకాశం ఉన్నవాళ్లు బూస్టర్ తీసుకోండి
ప్రస్తుతం కొవిడ్ టీకాలను ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వడం ఆపేశాయి. అందువల్ల భరించే శక్తి ఉన్నవాళ్లు ఒక బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిదని ప్రొఫెసర్ జమీల్ సూచిస్తున్నారు. ఇంతకుముందు తీసుకున్న టీకా కాకుండా వేరే టీకా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు మూడు డోసులు కొవిషీల్డ్ తీసుకుని ఉంటే నాలుగోడోసుగా మళ్లీ అది తీసుకోవద్దని, దానివల్ల కొన్ని సమస్యలు రావొచ్చని అన్నారు.
కేరళలోనే ఎక్కువ ఎందుకు?
కొవిడ్‌లో ఏ కొత్త వేరియంట్ వచ్చినా కేరళలోనే ఎక్కువ కేసులు కనపడుతున్నాయి. ఇందుకు కారణాన్ని కూడా ప్రొఫెసర్ జమీల్ వివరించారు. ఆ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికీ కొవిడ్ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నారని, అందుకే కేసులు బయటపడుతున్నాయని అన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా అంతగా పరీక్షలు చేయకపోవడం వల్లే కేసులు బయటకు రావట్లేదని చెప్పారు. పరీక్షల ఫలితాలను నిజాయితీగా బయటకు వెల్లడించడం, వేగంగా చెప్పడంలో దేశంలోనే కేరళ మొదటిస్థానంలో ఉంటుందని ఆయన ప్రశంసించారు. ఈ విషయంలో కేరళను ఆదర్శంగా తీసుకుని మళ్లీ అన్ని రాష్ట్రాలలోనూ కొవిడ్ పరీక్షలు పెంచాలని, లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.