Homeనేషనల్Mystery : దిశా సాలియాన్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి మరోసారి అనుమానాలు

Mystery : దిశా సాలియాన్‌ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి మరోసారి అనుమానాలు

Disha Salian death CBI probe : బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ (28) మృతి కేసు మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నాటి ఘటన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా.. ఆ మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని నిగ్గుతేల్చేందుకు బాంబే హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేస్తూ ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

కేసు పూర్వాపరాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు : దిశా సాలియాన్ జూన్ 8, 2020న ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం 14వ అంతస్తు నుంచి పడి మృతి చెందారు. ఆమె మరణించిన కొద్ది రోజులకే (జూన్ 14, 2020) నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సారంగ్ వి. కొత్వాల్, జస్టిస్ రంజిత్‌సిన్హా ఆర్. భోంసలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో బుధవారం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

 

తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు: దిశా సాలియాన్‌ తండ్రి సతీష్ సాలియాన్ ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మూలం ఆధారంగా అధికారికంగా ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. ముంబయి ప్రాంత సీబీఐ జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో తగిన అనుభవం ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సమగ్ర విచారణ జరిపించాలని ధర్మాసనం పేర్కొంది.
ముంబయిలోని మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన రికార్డులు, ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలు అన్నింటినీ తక్షణమే సీబీఐ అధికారులకు అప్పగించాలని ఆదేశించింది.

ఆధారాలుంటేనే నిందితులుగా పరిగణన: ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమన్నంత మాత్రాన ఏ ఒక్కరినీ ముందస్తుగా దోషిగా పరిగణించరాదని, దర్యాప్తు అధికారికి తగిన సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు లభిస్తేనే తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. విచారణలో నేర నిరూపణ కాకపోతే క్లోజర్ రిపోర్టు సమర్పించవచ్చని, అప్పుడు తండ్రి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛ ఉందని కోర్టు పేర్కొంది.

పోలీసుల తీరుపై తండ్రి అసంతృప్తి.. న్యాయం కోసమే పోరాటం : ముంబయి పోలీసులు నాటి ఘటనను తొలుత ‘అనుమానాస్పద మృతి’ (ADR) కింద నమోదు చేసి ఆత్మహత్యగా భావించారు. అయితే, రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడి గల వ్యక్తుల ప్రమేయం వల్లే ఈ కేసును తప్పుదోవ పట్టించారని దిశ తండ్రి సతీష్ సాలియాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కుటుంబ సభ్యుల తరఫు న్యాయవాది నిలేశ్ ఓజా వాదనలు వినిపిస్తూ.. ‘‘ఐదేళ్లు గడిచినా పోస్ట్‌మార్టం నివేదిక గానీ, ప్రాథమిక వివరాలు గానీ కుటుంబ సభ్యులకు అందించలేదు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించారు’’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఇది కచ్చితంగా హత్యాచారమేనని ఆరోపిస్తూ సతీష్ సాలియాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నామని, సీబీఐ ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న పూర్తి నమ్మకం ఉందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News