Diwali Bonus Toll Plaza Staff Protest: దీపావళి అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది బోనస్‌లు, గిఫ్ట్‌లు.. వెలుగులు నింపే దీపావళిని ప్రజలు మరింత సంతోషంగా జరుపుకోవాలని పలు కంపెనీలు ఉద్యోగులను బోనస్‌లు, గిఫ్ట్‌ల రూపంలో సంతృప్తి పరుస్తుంటాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం కనీసం స్వీట్ బాక్సులు కూడా ఇవ్వవు. సాక్షాత్తు ఉద్యోగులే సోషల్ మీడియా వేదికగా ఆవేదన చెందడం చూస్తుంటాం. పోనీలే మన ప్రాప్తం ఇంతే అని సరిపెట్టుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. దివాళీ బోనస్ ఇవ్వనందుకు ఏకంగా కంపెనీకే నష్టం తెచ్చి పెట్టారు ఉద్యోగులు. అసలేమైందంటే..
దీపావళి పండుగకు తమకు సరిపడా బోనస్ ఇవ్వలేదన్న కోపంతో టోల్ ప్లాజా సిబ్బంది ఊహించని పని చేశారు. విధులను పక్కనపెట్టి ఏకంగా టోల్ గేట్లను ఎత్తివేశారు. దీంతో వేలాది వాహనాలు టోల్ ఫీజు కట్టకుండానే దర్జాగా టోల్ గేటు నుంచి వెళ్లిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఆగ్రా- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ఈ సంఘటన చోటుచేసుకోవడంతో చర్చనీయాంశమైంది.
శ్రీ సైన్ అండ్ డాటర్ కంపెనీ ఈ ఫతేహాబాద్ టోల్ ప్లాజాను నిర్వహిస్తోంది. దివాళీ సందర్భంగా కంపెనీలో పనిచేస్తున్న 21 మంది సిబ్బందికి ఈ ఏడాది రూ. 1,100 చొప్పున బోనస్ అందించింది. అయితే ఈ బోనస్ డబ్బులతో సంతృప్తి చెందని టోల్ ఉద్యోగులు సోమవారం విధులు బహిష్కరించారు. టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం గేట్లు తెరిచారు. దీంతో ఎలాంటి ఫీజు చెల్లించకుండానే వేల కొద్దీ వాహనాలు టోల్ గేటు గుండా వెళ్లిపోయాయి.
ఈ విషయం మేనేజ్‌మెంట్ దృష్టికి చేరడంతో ఇతర టోల్ ప్లాజా సిబ్బందిని పిలిపించి విధులు కొనసాగేలా చేయాలని యత్నించారు. అయితే ఆందోళన చేస్తున్న ఉద్యోగులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉద్యోగులతో చర్చలు జరిపిన మేనేజ్‌మెంట్.. 10శాతం వేతనం పెంచుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో విధులు యథావిథిగా కొనసాగాయి. ఆందోళనల కారణంగా దాదాపు 3 గంటల పాటు వాహనాలు టోల్ ఫీజ్ చెల్లించకుండానే వెళ్లిపోయాయి.


