Diwali Special Trains South Central railway: దీపావళి, ఛట్ పూజ పండుగలు సమీపిస్తున్న వేళ కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా అంతా సిద్ధమవుతున్నారు. పండుగ నాటికి వారి స్వస్థలాలకు చేరేందుకు, పండుగ సంబరాల్లో పాల్గొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగ వేళ ప్రయాణీకులకు కేంద్ర కేబినెట్ శుభవార్త ప్రకటించింది. పండుగ సీజన్‌లో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం 12,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణీకులు సులభంగా చేరుకునేలా ప్రయాణించనున్నాయి. ఎక్కువ రద్దీ ఉండే మార్గాల్లో వీటిని తిప్పనున్నారు. దీపావళి పండుగ వేళ ఈ నిర్ణయం పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా చేస్తూ, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది.
దక్షిణ మధ్య రైల్వేకు 14 ప్రత్యేక రైళ్లు..
దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 14 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో 6 రైళ్లు సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ మధ్య, 8 నాందేడ్-పన్వి, సనత్‌నగర్-రాయ్‌పూర్ మధ్య రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. ఈ నెల 29 నుంచి సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ స్టేషన్ల మధ్య రైళ్ల సేవలు ప్రారంభవుతాయని వెల్లడించింది. మిగతా రైళ్ల రాకపోకలు వచ్చే నెల 2 నుంచి మొదలవుతాయని పేర్కొంది.
ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ విధానం..
1. ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ https://www.irctc.co.in/nget/redirect?pnr=2108873329&service=PRS_MEAL_BOOKING లింక్‌ను ఓపెన్ చేయండి.
2. మీకు IRCTC అకౌంట్ ఉంటే, లాగిన్ అవ్వండి. ఒకవేళ, మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ లేని పక్షంలో ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అందులో అడిగిన అన్ని వివరాలను నమోదు చేయండి.
3. మీ గమ్యస్థానం, ప్రయాణ తేదీలు, తరగతి (శ్రేణి) మొదలైన వివరాలను అందించండి.
4. మీరు ఎంచుకున్న వివరాల ఆధారంగా, మీకు అందుబాటులో ఉన్న రైళ్ల జాబితా కనిపిస్తుంది. వాటిలో మీరు ప్రయాణించాల్సిన రైలును సెలెక్ట్ చేసుకోండి.
5. ఎంచుకున్న రైలులో మీరు ప్రయాణించనున్న వ్యక్తుల వివరాలను పూరించండి.
6. చివరగా, చెల్లింపును ఆన్‌లైన్‌లో జరిపి, టికెట్ బుక్ చేసుకోండి. చెల్లింపు పూర్తయ్యాక, మీ టికెట్ జనరేట్ అవుతుంది. ఈ టికెట్‌ను ప్రింట్‌అవుట్ తీసుకొని ప్రయాణ సమయంలో దగ్గర పెట్టుకోండి.
ఆఫ్‌లైన్ బుకింగ్ ఇలా..
మీకు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేయడంలో ఇబ్బందులు తలెత్తితే.. మీ సమీప రైల్వే స్టేషన్ కౌంటర్‌ను సందర్శించి టికెట్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ టిక్కెట్లను ముందే తీసుకోవచ్చు. దీపావళి, ఛట్ పూజ పండుగలు సమీపిస్తున్నందున ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.


