Karnataka Chief Minister change : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి కుర్చీ చుట్టూ జరుగుతున్న చర్చ మరోసారి రాజుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఈ అంశానికి, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త ఆజ్యం పోశాయి. “నాకేం తొందర లేదు, నా తలరాత ఏంటో నాకు తెలుసు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేపుతున్నాయి. అసలు ఆయన వ్యాఖ్యల అంతరార్థం ఏమిటి…? సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నారా లేక భవిష్యత్తుపై భరోసాతో ఉన్నారా..? సిద్ధరామయ్య శిబిరంలో ఏం జరుగుతోంది..?
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను పార్టీకి విధేయుడినని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లాల్‌బాగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం పదవికి సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు.
“నాకు తొందరపాటు లేదు. నా తలరాత ఏంటో నాకు బాగా తెలుసు. ప్రస్తుతం నా ఏకైక లక్ష్యం, ఏకైక ప్రాధాన్యత 2028లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే,” అని శివకుమార్ ఉద్ఘాటించారు. సీఎం మార్పుపై బహిరంగంగా మాట్లాడుతున్న నేతలకు నోటీసులు ఇవ్వాలని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్‌కు సూచించినట్లు తెలిపారు. తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలిసికట్టుగా పనిచేస్తున్నామని, కాంగ్రెస్ అధిష్ఠానం మార్గదర్శకాలకు శిరసావహిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
అయిదేళ్లూ ఆయనేనా? తెరవెనుక ఏం జరుగుతోంది : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుంచి సీఎం పీఠంపై చర్చ కొనసాగుతూనే ఉంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ పదవి కోసం తీవ్రంగా పోటీ పడగా, అధిష్ఠానం సుదీర్ఘ మంతనాల తర్వాత సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. అప్పట్లో “అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది” అంటూ డీకే చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి పదవిపై తన ఆశను పరోక్షంగా తెలిపారు.
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్టోబర్ 13న మంత్రులందరికీ విందు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఇది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసమేనని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను సీఎం కొట్టిపారేశారు. “చాలా కాలంగా మంత్రులను భోజనానికి పిలవలేదు, అందుకే పిలిచాను. దీనికి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి సంబంధం లేదు,” అని ఆయన స్పష్టం చేశారు.
అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న మంత్రుల్లో 50 శాతం మందిని తొలగించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ద్వారా, కొత్తగా వచ్చిన మంత్రుల మద్దతుతో పార్టీలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవచ్చని, తద్వారా సీఎం మార్పు చర్చకు తాత్కాలికంగా తెరదించవచ్చని ఆయన వ్యూహంగా చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ చుట్టూ జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి అద్దం పడుతున్నాయి.


