కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పు జరగబోతోందంటూ వస్తున్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. కర్ణాటక ముఖ్యమంత్రి మారబోతున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తూ, తాను అలాంటి మార్పులకు ఆశపడటం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను సీఎం పదవిలోకి తీసుకురాబోతున్నారంటూ కొన్ని వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అఖిల భారత వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలా బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావడంతో, ఆ ఊహాగానాలకు మరింత ప్రచారం చేకూరింది.
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించిన డీకే శివకుమార్, ప్రస్తుతం కర్ణాటకలో సీఎం మార్పు అనేది ఎజెండాలో లేదని, అసలు ఆలోచన కూడా లేదన్నారు. “నాకు సీఎం పదవి కావాలని నేను ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. నాకు ఎమ్మెల్యే మద్దతు అవసరమూ లేదు. పార్టీలో ఏ మార్పులు జరగవు” అని ఆయన తేల్చిచెప్పారు. రణ్‌దీప్ సుర్జేవాలా ఎమ్మెల్యేలతో సమావేశమైన అంశంపై కూడా డీకే స్పందించారు. “ఆ సమావేశం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలపై చర్చించేందుకు మాత్రమే జరిగింది. ప్రభుత్వం మార్పు గురించి మాట్లాడలేదని,” ఆయన స్పష్టం చేశారు. నాయకత్వ మార్పుపై నిరాధార ప్రచారాలు చేయడం మానుకోవాలని డీకే శివకుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. “ఇలాంటి విషయాలు మళ్లీ ప్రస్తావించినట్లయితే, ఆ వ్యక్తులపై పార్టీ కఠినంగా స్పందించాల్సి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం తమ పార్టీ దృష్టంతా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే 2028 అసెంబ్లీ ఎన్నికల వైపు మళ్లించబడిందని డీకే తెలిపారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు చేరేలా చర్యలు చేపడతామని, ఏకగ్రీవ నాయకత్వంతో ముందుకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు.