500gm Stone Removal Surgery : పద్దెనిమిదేళ్లు.. ఒక యుగం లాంటి కాలం. అంతకాలం పాటు కడుపులో అరకిలో బరువున్న రాయిని మోస్తూ ఆ యువకుడు అనుభవించిన బాధ వర్ణనాతీతం. మందులు వాడినా తగ్గని నొప్పి, మూత్ర విసర్జనలో మంటతో నరకం చూశాడు. చివరికి వైద్యుల చొరవతో ఆ బరువు దిగిపోయింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్స ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వైద్యుల నైపుణ్యంతో ఓ వ్యక్తికి పునర్జన్మ లభిస్తే.. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంతో బిహార్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.
18 ఏళ్ల వ్యధ.. 500 గ్రాముల రాయి : మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన 32 ఏళ్ల ఓ యువకుడు (దేవేంద్రనగర్ తహసీల్, ఈటవా గ్రామం) గత 18 ఏళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఉపశమనం లభించలేదు. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పి వచ్చేది. ఇటీవల నొప్పి భరించలేనంతగా మారడంతో పన్నాలోని డాక్టర్ హెచ్.ఎన్. శర్మను ఆశ్రయించాడు.
నిర్ధారణ: వైద్యులు ఎక్స్-రే, ఇతర పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులు చూసి షాక్ తిన్నారు. అతడి కడుపులో (బ్లాడర్ ప్రాంతంలో) భారీ సైజు రాయి ఉన్నట్లు గుర్తించారు.
శస్త్రచికిత్స: జనవరి 22న డాక్టర్ శర్మ తన బృందంతో కలిసి క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 500 గ్రాముల (అరకిలో) బరువున్న రాయిని విజయవంతంగా వెలికితీశారు.
రికార్డు స్థాయి ఆపరేషన్ : శస్త్రచికిత్స అనంతరం డాక్టర్ హెచ్.ఎన్. శర్మ మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకు 65 నుంచి 70 వరకు ఆపరేషన్లు చేశాను. చాలామందికి రాళ్లను తొలగించాను. కానీ, ఇంత భారీ పరిమాణంలో రాయిని చూడటం ఇదే తొలిసారి. రోగి 18 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతమైంది. రోగి కోలుకుంటున్నాడు, ఆహారం తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు” అని తెలిపారు.
మరోవైపు విషాదం.. కడుపులో కత్తెర మరిచిపోయి : వైద్యో నారాయణో హరి.. అంటూ దేవుడితో సమానంగా కొలిచే వృత్తిలో కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. బిహార్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
అసలేం జరిగింది : తమోతీహరి జిల్లాకు చెందిన మణిభూషణ్ కుమార్ భార్య ఉషాదేవి (25)కి ఏడాదిన్నర క్రితం ఓ ప్రైవేట్ క్లినిక్‌లో సిజేరియన్ (C-Section) చేశారు. ఆ సమయంలో డాక్టర్ సంగీత కుమారి నిర్లక్ష్యంతో ఆపరేషన్‌కు వాడే కత్తెరను (Forceps) కడుపులోనే మరిచిపోయి కుట్లు వేశారు.
నరకయాతన: ఇంటికి వెళ్ళాక ఉషాదేవికి కడుపునొప్పి మొదలైంది. కుటుంబ సభ్యులు పలుమార్లు ఆసుపత్రికి తిప్పినా, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపారే తప్ప అసలు సమస్యను గుర్తించలేదు. అల్ట్రాసౌండ్‌లో కూడా అది బయటపడకపోవడం గమనార్హం. ఇటీవల నొప్పి తీవ్రమవడంతో వేరే ఆసుపత్రిలో సిటీ స్కాన్ తీయించగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది. ఆ కత్తెర పేగులను చీల్చివేయడంతో లోపల తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. దానిని తొలగించేందుకు రహమానియా మెడికల్ సెంటర్‌లో జనవరి 2న శస్త్రచికిత్స చేస్తుండగా ఉషాదేవి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు ఆందోళన చేపట్టగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకచోట వైద్యం ప్రాణం పోస్తే.. మరోచోట అదే వైద్యం నిర్లక్ష్యంతో ప్రాణం తీయడం గమనార్హం.

