Mid-day Meal Contamination : అభం శుభం తెలియని చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సిన మధ్యాహ్న భోజన పథకం.. నిర్లక్ష్యానికి చిరునామాగా మారింది. పాఠశాల ప్రాంగణంలోకి వచ్చిన ఓ వీధికుక్క వంట కోసం సిద్ధంగా ఉంచిన కూరగాయలను నాకుతుంటే చూసీచూడనట్టు వదిలేయడమే కాకుండా, అవే కూరగాయలతో వండిన భోజనాన్ని విద్యార్థుల కంచాల్లో వడ్డించిన అత్యంత దారుణమైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. ఈ విషయం బయటపడటంతో ఏకంగా 78 మంది విద్యార్థులకు రేబిస్ నివారణ టీకాలు వేయాల్సి వచ్చింది. అసలేం జరిగింది..? అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది..?
అసలేం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్ జిల్లా, లఛన్‌పుర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జులై 29న ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి ఏర్పాట్లు చేస్తుండగా, ఓ వీధి కుక్క వంటగది సమీపంలోకి వచ్చి, వండటానికి సిద్ధంగా ఉంచిన కూరగాయలను నాకింది. ఈ దృశ్యాన్ని గమనించిన కొందరు విద్యార్థులు వెంటనే వంట సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే, వారు విద్యార్థుల మాటలను పెడచెవిన పెట్టారు. “అలాంటిదేమీ జరగలేదు, మీరు అనవసరంగా వాదిస్తున్నారు” అంటూ విద్యార్థులపైనే ఎదురుతిరిగి, అవే కలుషితమైన కూరగాయలతో వంట పూర్తిచేశారు. మొత్తం 84 మంది విద్యార్థులకు ఆ భోజనాన్ని వడ్డించారు.
తల్లిదండ్రుల ఆందోళన.. అధికారుల చర్యలు : పాఠశాల ముగిసి ఇళ్లకు వెళ్లిన చిన్నారులు, జరిగిన దారుణాన్ని తమ తల్లిదండ్రులకు వివరించారు. దీంతో ఆగ్రహోదగ్రులైన తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను నిలదీశారు. తాము వంటవారికి చెప్పినా వినలేదని ఉపాధ్యాయులు బదులివ్వడంతో, గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వంట పని నిర్వహిస్తున్న ‘జై లక్ష్మీ స్వయం సహాయక బృందం’ను తక్షణమే తొలగించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పిల్లల ఆరోగ్య భద్రతపై తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, వారిని సమీపంలోని లఛన్‌పూర్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యురాలు డాక్టర్ వీణా వర్మ, ముందు జాగ్రత్త చర్యగా 78 మంది విద్యార్థులకు యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ మొదటి డోసును అందించారు. గ్రామస్థులు మరియు పాఠశాల కమిటీ అభ్యర్థన మేరకే ఈ టీకాలు వేసినట్లు, మొదటి డోసుతో ఎలాంటి ప్రమాదం ఉండదని ఆమె స్పష్టం చేశారు.
విచారణకు ఆదేశం : ఈ ఘటనపై పలారి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) దీపక్ నికుంజ్ వెంటనే స్పందించి, విచారణకు ఆదేశించారు. ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పాఠశాలను సందర్శించి దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక విచారణ అనంతరం, మధ్యాహ్న భోజన పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న ‘జై లక్ష్మీ స్వయం సహాయక బృందం’ను తాత్కాలికంగా ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే లేఖ : ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహూ, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. అదే సమయంలో, ఎవరి ఆదేశాల మేరకు విద్యార్థులకు రేబిస్ టీకాలు వేశారనే అంశంపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం.


