ఆర్మీ ట్రాకర్ డాగ్ మేరు రిటైర్ అవ్వగా, దానికి ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు అధికారులు. మీరట్ లోని డాగ్స్ రిటైర్మెంట్ హోంలోని ద రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (ఆర్వీసీ) సెంటర్ లో ఈ కుక్కకు శేష జీవితం గడిపేలా సకల సదుపాయాలు కల్పించారు. ఓ ఉన్నతోద్యోగి రిటైర్ అయితే ఎలా సగౌరవంగా వారిని విధుల నుంచి లాంఛనాలతో సాగనంపుతారో అచ్చం అలానే ఈ మేరు అనే కుక్కను కూడా సాగనంపటం విశేషం.
రిటైర్ అయ్యాక మేరు ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో మీరట్ కు తరలివెళ్లింది. ఈమధ్యనే రక్షణ మంత్రిత్వ శాఖ రిటైర్ అయిన కుక్కలను ఇలా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో సాగనంపేందుకు అవసరమైన చట్టాలను రూపొందించింది.
సైన్యంలో, పోలీసుల రంగాల్లో కుక్కలు అందించే సేవలు అపారమైనవి. అందుకే రిటైర్ అయిన కుక్కలకు చాలామంది అధికారులు అధికారికంగా, గొప్పగా సెండ్ ఆఫ్ ఇస్తుంటారు.
రిటైర్ అయిన కుక్కలకు గౌరవప్రదమైన పదవీ విరమణ ఇచ్చి, మీరట్‌లోని RVC సెంటర్ కు పంపాక, అక్కడ అవి జీవితాంతం ఉంటాయి. ఈ సెంటర్ లోని కుక్కలను కుక్క ప్రేమికులు ఉచితంగా దత్తత తీసుకోవచ్చు. సుమారు 8 ఏళ్లపాటు (కొన్ని జాతులు 10-12 ఏళ్లు) కుక్కలు సైన్యంలో సేవలందిస్తాయి. సైన్యంలో వీటికి కూడా ర్యాంకులు ఉంటాయి, ఇవి చాలా గౌరవప్రదమైన ర్యాంకులు కావటం విశేషం. నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ గా వీటికి ర్యాంక్ ఉంటుంది, అయితే ఈ కుక్కల హ్యాండ్లర్స్ కంటే వీటికే ఒక ర్యాంక్ ఎక్కువగా ఉండటం హైలైట్. సర్వీసులో ఉన్నప్పుడే ఇవి చనిపోతేమాత్రం గౌరవప్రదంగా అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు.