Fake residence certificate : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… బిహార్ పౌరుడిగా మారాలనుకుంటున్నారా..? ఏకంగా నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు! ఈ వార్త చదవగానే మీకు మైండ్ బ్లాక్ అయిందా..? బిహార్‌లోని సమస్తిపుర్ జిల్లా అధికారులకు కూడా దిమ్మతిరిగిపోయింది. ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో డొనాల్డ్ ట్రంప్ ఫోటో, ఆధార్ వివరాలతో వచ్చిన దరఖాస్తును చూసి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు ఈ దరఖాస్తు ఎవరు చేశారు..? కుక్కలు, ట్రాక్టర్ల తర్వాత ఇప్పుడు ఏకంగా ట్రంప్ పేరుతో ఈ ఫేక్ దరఖాస్తుల పరంపర వెనుక ఉన్న ఆకతాయిలెవరు..?
బిహార్‌లోని సమస్తిపుర్ జిల్లా, మోహియుద్దీన్‌నగర్ బ్లాక్ ప్రభుత్వ పోర్టల్‌లో జులై 29న ఓ వింత దరఖాస్తు ప్రత్యక్షమైంది. దరఖాస్తుదారుడి పేరు: డొనాల్డ్ ట్రంప్. చిరునామా: వార్డ్ నంబర్ 13, హసన్‌పుర్ గ్రామం. దరఖాస్తు నంబర్: BRCCO /2025 /17989735. ఈ దరఖాస్తుతో పాటు ట్రంప్ ఫోటో, ఆధార్ కార్డు వివరాలు కూడా జత చేసి ఉన్నాయి.
అప్రమత్తమైన అధికారులు.. కేసు నమోదు: ఈ వింత దరఖాస్తును చూసి అప్రమత్తమైన అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ట్రంప్ పేరుతో వచ్చిన దరఖాస్తు, ఫోటో, ఆధార్ నంబర్, బార్‌కోడ్, చిరునామా సహా అన్నీ నకిలీవని తేల్చారు. సర్కిల్ ఆఫీసర్ (CO) వెంటనే ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని అపహాస్యం చేసే తీవ్రమైన ప్రయత్నమని, దీనిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. “ఫారమ్ సమర్పించిన వ్యక్తి ఐపీ అడ్రస్, లాగిన్ వివరాలను ట్రాక్ చేస్తున్నాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని ఆయన స్పష్టం చేశారు.
ఇది కొత్తేమీ కాదు.. కుక్కకు, ట్రాక్టర్‌కు కూడా : బిహార్‌లో ఇలాంటి విచిత్రమైన దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని రోజులుగా ఈ ఆకతాయి చేష్టలు అధికారులకు తలనొప్పిగా మారాయి.
కుక్కకు సర్టిఫికెట్: కొద్ది రోజుల క్రితం, ‘డాగ్ బాబు’ పేరుతో ఒక కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు రాగా, అధికారులు గమనించకుండా జారీ చేసేశారు. ఈ విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో, సర్టిఫికెట్‌ను రద్దు చేసి, ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
ట్రాక్టర్‌కు దరఖాస్తు: ఆ తర్వాత, ఓ వ్యక్తి తన ట్రాక్టర్‌కు నివాస ధ్రువీకరణ పత్రం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా, దరఖాస్తులో భోజ్‌పురి నటి మోనాలిసా ఫోటోను జత చేశాడు.
ఈ వరుస ఘటనల నేపథ్యంలో, ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో దరఖాస్తు రావడం గమనార్హం. ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని, కొందరు ఆకతాయిలు కావాలనే ఇలా చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగడంతో, ఈ ఫేక్ దరఖాస్తుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు త్వరలోనే పట్టుబడతారని ఆశిస్తున్నారు.


