Central government: దేశంలో ముడిచమురు (Crude Oil) నిల్వలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతదేశం వద్ద ఇంధన నిల్వలు కేవలం 25 రోజులకు మాత్రమే సరిపోతాయని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది.
8 వారాల పాటు నిరంతరాయ సరఫరా!: ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు నిల్వలపై కేంద్రం గణాంకాలతో సహా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం సుమారు 250 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు మరియు రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నిల్వలు దేశం మొత్తానికి దాదాపు 7 నుంచి 8 వారాల పాటు నిరంతరాయంగా సరిపోతాయని పేర్కొంది. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ వంటి ప్రాంతాల్లోని వ్యూహాత్మక నిల్వ కేంద్రాలతో (Strategic Reserves) పాటు దేశవ్యాప్తంగా ఉన్న పైప్‌లైన్లు, నౌకలు, రిఫైనరీలలో ఈ నిల్వలను సురక్షితంగా ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also read-Layoffs: లేఆఫ్స్‌పై టెక్ మహీంద్రా స్పష్టత.. 30 వేల మంది తొలగింపు వార్తలు అవాస్తవం!
ధరల పెంపు ఉండదు: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఆ భారాన్ని సామాన్యులపై మోపబోమని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. ధరల వ్యత్యాసం వల్ల కలిగే అదనపు భారాన్ని చమురు సంస్థలే భరించాలని పేర్కొంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వివిధ దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటూ ఇంధన భద్రతను పటిష్టం చేసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

