Friday, September 20, 2024
Homeనేషనల్Puttaparthi: సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం

Puttaparthi: సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు

మానవసేవే మాధవసేవ అని బోధించిన శ్రీ సత్య సాయి సేవలు అందరికీ ఆదర్శనీయమని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పేర్కొన్నారు. బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్‌ సెంటర్‌ లో శ్రీ సత్య సాయి బాబా యూనివర్సిటీ 42 వ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధి గా హాజరవ్వగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిధిగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లర్నింగ్ (ఎస్.ఎస్.ఎస్. ఐ.హెచ్ ఎల్) ఛాన్స్.లర్ కే చక్రవర్తి రిటైర్ ఐఏఎస్, వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ బి రాఘవేంద్ర ప్రసాద్,రాష్ట్ర మహిళా, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ మంత్రి కె.వి ఉష శ్రీ చరణ్, సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఎస్ ఎస్ నాగానంద్ , తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ… పుట్టపర్తిలో శ్రీసత్యసాయి 98వ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.నేడు భగవాన్ సత్య సాయి బాబా సమాధిని దర్శించే సౌభాగ్యం కలిగిందన్నారు. ప్రశాంతి అనగా ఆధ్యాత్మిక శాంతి అని అన్నారు. సదా సత్యం పలకాలని, సదా ధర్మాన్ని ఆచరించాలన్న బాబా వాక్కులను నిజ జీవితంలో అలవరుచుకొని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. భగవాన్ సత్యసాయిబాబా తాను బోధించిన మానవతా విలువలు, ఆధ్యాత్మికత కలగలిపి ఆధునిక విజ్ఞానాన్ని అందించేందుకు చక్కటి విద్యా వ్యవస్థను నెలకొల్పారన్నారు. మనమందరం ఆధ్యాత్మిక చింతన ,కరుణ,పరోపకారం కలిగి సత్యసాయిబాబా అడుగుజాడల్లో నడవాలన్నారు. సత్యసాయి భారతీయ విద్యావిధానంలో అనాదిగా అమలవుతున్న గురుకుల విద్యా విధానానికి మెరుగులుదిద్దుతూ, నేటి సమాజ అవసరాల మేరకు మార్పులు చేసి నూతన గురుకుల విధానాన్ని అమలయ్యేలా విద్యా వ్యవస్థలను రూపొందించారన్నారు. మానవతా విలువలు, ఆధ్యాత్మికత, శాస్త్ర సాంకేతిక అంశాలతో కూడిన సమ్మిళిత విద్యను బోధిస్తూ అత్యద్భుతమైన ఫలితాలతో ప్రపంచంలోనే మేటి విద్యాసంస్థల సరసన నిలిపారన్నారు. సత్యసాయి విద్యాసంస్థలు ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఆదర్శ విద్యను అందిస్తున్నాయన్నారు. అందువల్లే సత్యసాయి విద్యాసంస్థలు విలువల నిలయాలుగా నిలచాయన్నారు. భగవాన్ సత్యసాయి బాబా ప్రజలకు వైద్య, విద్యా,మంచినీరు వంటి ఎన్నో సేవలు అందించారాన్నారు.భగవాన్ సత్యసాయిబాబా సేవలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. గోల్డ్ మెడల్ సాధించిన, క? కాన్వకేషన్ పొందిన విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ… బాబా సత్యసాయిబాబా 42 వ స్నాతకోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ప్రేమ,సాధన వంటి వాటిని అలవర్చుకొని జీవితంలో అభివృద్ధి చెంది దేశానికి సేవలు అందించాలన్నారు శ్రీ సత్య సాయి బాబా విద్యాసంస్థల్లో నేటి ఆధునిక విద్యతోపాటు సమగ్ర సమైక్యతను నెలకొల్పే ప్రాచీన కాల గురుకుల విద్య వ్యవస్థను కూడా పాటిస్తూ విద్యార్థుల జీవితంలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. ప్రపంచమంతా వసుదైక కుటుంబమని ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి జీవించాలని సూచించారు. అలాగే విద్యార్థులు అందరూ ధర్మం సత్యాన్ని పాటించి ధర్మో రక్షిత రక్షితః అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్న స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు. అలాగే కాన్వకేషన్ పొందిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన శ్రీసత్యసాయి బాబా విద్యాసంస్థల విద్యార్థులకు పట్టాలతో పాటు 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమానికి ముందు ట్రస్ట్ సభ్యులు ముఖ్య అతిథులను సన్మానించారు.వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ బి రాఘవేంద్ర ప్రసాద్ కాన్వగేషన్ పొందిన విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భారత వాయుసేన విమానంలో ఒడిశా నుంచి బుధవారం మధ్యాహ్నం సత్యసాయి విమానాశ్రయానికి ద్రౌపది ముర్ము చేరుకున్నారు.అనంతరం రాష్ట్రపతి సాయి కుల్వంత్ హాలు లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ , ఎమ్మెల్యేలు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు,వివిధ విద్యా సంస్థల అధికారులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News