DRDO- SFDR: డీఆర్‌డీఓ మరో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సుదూర గగనతల క్షిపణుల అభివృద్ధికి మార్గం సుగమం చేసేందుకు చేపట్టిన కీలక ప్రయోగం ఎస్ఎఫ్‌డీఆర్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డీఆర్‌డీఓ చేపట్టిన ఈ టెక్నాలజీ ప్రయోగంతో భారత్‌కు వ్యూహాత్మక బలం పెరగనుంది.
Also Read: https://teluguprabha.net/national-news/yumnam-khemchand-singh-is-the-new-chief-minister-of-manipur/
ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR) నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO) సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్(SFDR) టెక్నాలజీని విజయవంతంగా ప్రదర్శించింది. ఈ టెక్నాలజీ భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందే సుదూర గగనతల క్షిపణుల(ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్) తయారీలో ముఖ్యంగా అస్త్ర మార్క్- 3లో కీలకంగా పనిచేయనుంది. మంగళవారం ఉదయం 10:45 గంటల సమయంలో ఈ పరీక్షను నిర్వహించగా.. ముందుగా గ్రౌండ్ బూస్టర్ సాయంతో క్షిపణి వ్యవస్థను నిర్దేశిత వేగానికి చేరుకునేలా చేశారు.
ఈ పరీక్షలో నోజిల్-లెస్ బూస్టర్, రామ్‌జెట్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి కీలక ఉపవ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయని డీఆర్‌డీఓ సైంటిస్టులు ధ్రువీకరించారు. ఈ టెక్నాలజీ సాధారణ రాకెట్ల మాదిరిగా కాకుండా.. గాలిలోని ఆక్సిజన్‌ను గ్రహించి ఇంధనం మండేలా చేస్తుందని చెప్పారు. దీనివల్ల మిస్సైల్ బరువు తగ్గడమే కాకుండా, ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని పొందుతుందన్నారు. గరిష్ఠంగా మ్యాక్ 3(సాధారణ ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ) వేగాన్ని అందుకునే శక్తిని సాధిస్తుందని వివరించారు.
డీఆర్‌డీఓకు చెందిన డీఆర్‌డీఎల్, హెచ్ఈఎంఆర్‌ఎల్, ఆర్‌సీఐ వంటి ప్రయోగశాలలు సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. SFDR టెక్నాలజీ భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తాజా విజయంతో ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్న అత్యంత శక్తివంతమైన మిస్సైల్ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్ స్థానం సంపాదించుకుంది. ఇది శత్రు విమానాలను చాలా దూరం నుంచే అడ్డుకునే సామర్థ్యాన్ని భారత వాయుసేనకు అందిస్తుంది.

