ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా(Kumbh Mela) ఈనెల 26 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) కుంభమేళాలో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి బోటులో త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహా కుంభమేళా అధ్యాత్మిక కార్యక్రమం జనవరి 13న ప్రారంభమైంది. భారత్‌తోపాటు విదేశాల నుంచి భారీసంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటివరకు 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది.