Dulquer Salmaan House Raided Over Luxury Car Tax Evasion: లగ్జరీ కార్ల పన్ను ఎగవేతకు సంబంధించి రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు దేశవ్యాప్తంగా ‘నుంఖోర్’ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా కేరళలోని 30కి పైగా ప్రముఖ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరువనంతపురం, ఎర్నాకులం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ప్రముఖ మలయాళ నటులు దుల్కర్ సల్మాన్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లు కూడా ఉండటం సంచలనం సృష్టించింది.
అధికారులు ఈ ఇళ్లకు చేరుకున్నప్పటికీ, అనుమానిత వాహనాలను మాత్రం గుర్తించలేకపోయారు. మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేస్తున్న కస్టమ్స్ అధికారులు, రాష్ట్రంలోని పలు ప్రముఖ కార్ల షోరూమ్‌లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఎనిమిది రకాల హై-ఎండ్ వాహనాలను భూటాన్ మీదుగా భారతదేశంలోకి తీసుకువచ్చి పన్నులు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వాహనాలను మొదట హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ చేసి, ఆ తర్వాత నకిలీ నంబర్ ప్లేట్లతో దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది.
పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని, వారు తమ వాహనాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సెలబ్రిటీల ఇళ్లపై దాడులు మీడియా దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఈ ఆపరేషన్ ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని, పన్ను ఎగవేతకు పాల్పడుతున్న షోరూమ్‌లు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ దాడులు దేశవ్యాప్తంగా ఆదాయాన్ని పరిరక్షించడం, నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ‘నుంఖోర్’ ఆపరేషన్ పలు దశల్లో కొనసాగుతుందని, పత్రాలు, రిజిస్ట్రేషన్ విధానాలు, రవాణా మార్గాలపై దృష్టి సారించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


