Saturday, November 15, 2025
HomeTop StoriesDurga Puja Tradition: పట్టాలపై అమ్మవారి పయనం... 111 ఏళ్లుగా బొమ్మ రైలులోనే దుర్గమ్మ శోభాయాత్ర!

Durga Puja Tradition: పట్టాలపై అమ్మవారి పయనం… 111 ఏళ్లుగా బొమ్మ రైలులోనే దుర్గమ్మ శోభాయాత్ర!

Darjeeling toy train Durga procession : దుర్గమ్మ నిమజ్జనం అనగానే మన కళ్ల ముందు మెదిలేది డప్పు చప్పుళ్లు, తీన్మార్ డాన్సులు, జనసంద్రంతో కిక్కిరిసిన వీధులు. కానీ, హిమాలయ సానువుల్లోని డార్జిలింగ్‌లో మాత్రం ఈ శోభాయాత్ర ఓ రైలు పట్టాలపై సాగుతుంది. అది కూడా మామూలు రైలు కాదు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బొమ్మ రైలులో! శతాబ్దానికి పైగా కొనసాగుతున్న ఈ అపురూప ఘట్టం వెనుక ఉన్న కథేంటి..? బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు..?

- Advertisement -

దుర్గామాత శోభాయాత్ర అంటే భారీ ఊరేగింపులు, వాహనాలపై అమ్మవారి విగ్రహాలు, కోలాహలం. కానీ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో మాత్రం ఈ సంప్రదాయం చాలా భిన్నంగా, చారిత్రాత్మకంగా సాగుతుంది. ఇక్కడ అమ్మవారిని సాగనంపేది రోడ్లపై కాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత ‘టాయ్ ట్రైన్’లో. గత 111 ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ అద్వితీయమైన వేడుక, మత సామరస్యానికి, సంప్రదాయ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.

బ్రిటీష్ కాలంలోనే బీజం: ఈ విలక్షణమైన సంప్రదాయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలనలో ‘కూచ్ బిహార్’ సంస్థానాన్ని పాలించిన మహారాజా నృపేంద్రనారాయణ్ (1863-1911) కాలంలో దీనికి అంకురార్పణ జరిగింది. ఆ రోజుల్లో డార్జిలింగ్, దాని పరిసర ప్రాంతాల్లో దుర్గా పూజ ఉత్సవాలు చాలా అరుదుగా జరిగేవి. మహారాజానే ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించే ఆచారానికి శ్రీకారం చుట్టారు. 1879-1881 మధ్య సిలిగురిని డార్జిలింగ్‌తో కలుపుతూ నిర్మించిన ఈ టాయ్ ట్రైన్ మార్గం అప్పట్లో ప్రధాన రవాణా వ్యవస్థ. దీంతో, సిలిగురిలోని కుమోర్తులి నుంచి అమ్మవారి విగ్రహాలను డార్జిలింగ్‌కు శోభాయాత్రగా తీసుకురావడానికి ఈ బొమ్మ రైలునే ఉపయోగించేవారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ వంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ఊరేగింపు సాగేది. కాలక్రమంలో రోడ్లు అభివృద్ధి చెందినా, డార్జిలింగ్ వాసులు మాత్రం తమ పూర్వీకుల సంప్రదాయాన్ని వీడలేదు.

రైలులో శోభాయాత్ర సాగిందిలా: డార్జిలింగ్‌లోని ‘రాజా నృపేంద్రనారాయణ్ బెంగాలీ హిందూ హాల్’ అనే సంస్థ గత 111 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రులను అత్యంత వైభవంగా జరిపారు. నిమజ్జనం రోజున, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. శోభాయాత్ర కోసం టాయ్ ట్రైన్‌లో మూడు బోగీలను కేటాయించడం విశేషం.

ఒక బోగీని పూర్తిగా అమ్మవారి విగ్రహం కోసం అలంకరించి, అందులోనే వాయిద్యకారులు, కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. మిగిలిన రెండు బోగీలలో భక్తులు కూర్చుని, భజనలు చేస్తూ అమ్మవారిని కీర్తించారు. ఈ భక్తిభరిత ప్రయాణం సుమారు 40 నిమిషాల పాటు సాగింది. డార్జిలింగ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగ్‌బుల్ గ్రామానికి రైలు చేరుకుంది. అక్కడి రంగ్‌బుల్ నదిలో స్థానిక ప్రజల భాగస్వామ్యంతో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసి, భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

ఐక్యతకు నిదర్శనం: “గత 111 ఏళ్లుగా మేము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. డార్జిలింగ్‌లో నివసించే సుమారు 30 బెంగాలీ కుటుంబాలతో పాటు, స్థానిక గిరిజన తెగల వారు కూడా వేష, భాషలకు అతీతంగా ఈ వేడుకలో పాల్గొంటారు. ఇది డార్జిలింగ్ ప్రజల ఐక్యతకు నిదర్శనం. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా, ప్రపంచ వారసత్వ సంపద అయిన ఈ రైలులో అమ్మవారిని సాగనంపడం మాకు గర్వకారణం,” అని హిందూ హాల్ కమిటీ కార్యదర్శి సుభాషిశ్ సేన్‌గుప్తా తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad