Earning Wife Has Right to Alimony: సంపాదిస్తున్న భార్య కూడా భర్త నుంచి భరణం పొందే హక్కును కలిగి ఉంటుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ సమయంలో ఉన్న జీవన ప్రమాణాలను కొనసాగించడానికి భార్యకు ఈ భరణం అవసరమని కోర్టు పేర్కొంది. కేవలం భార్య సంపాదిస్తోంది కాబట్టి భర్త ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. నాగ్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఊర్మిళ జోషి ఫాల్కే ఈ మేరకు తీర్పు చెప్పారు.
కేసు వివరాలు..
నాగ్‌పుర్‌కి చెందిన వ్యక్తికి వార్దాకు చెందిన మహిళతో కొంత కాలం క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. వారి విడాకుల అనంతరం భార్యకు భరణం ఇవ్వాలని వార్దా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఆమె ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నందు వల్ల పిల్లలను చూసుకోగలదని, భరణం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆ తీర్పును సదరు వ్యక్తి హైకోర్టులో సవాలు చేశారు. అయితే భరణం ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
గతంలోనూ..
దిల్లీ హైకోర్టు సైతం ఇటీవలే ఓ కేసులో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పిల్లల బాగోగులు చూడటానికి ఉద్యోగం మానేయాల్సిరావడం, విడాకుల అనంతరం మహిళ తన తల్లిదండ్రులతో నిరవధికంగా ఉండలేకపోవడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత కూడా భార్యకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందని న్యాయస్థానం పునరుద్ఘాటించింది.


