Earthquake In Delhi: ఈ ఉదయం ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పక్కనే ఉన్న ఎన్‌సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం (జూలై 10) ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. గురవారం ఉదయం 9.04 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అకస్మాత్తుగా వచ్చిన భూప్రకంపనల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు తేలింది.
ఈ భూకంప కేంద్రం హరియాణా రాష్ట్రంలోనే ఝజ్జర్‌కు 3 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు జాతీయ భూకంప కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రాంతం పశ్చిమ ఢిల్లీకి కేవలం 51 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రత భారీగా చోటుచేసుకుంది. ఢిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది.
గతంతో పోలిస్తే ఈసారి వచ్చిన భూకంప తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల అనేక చోట్ల ప్రజలు కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఇదే విషయమై ఎన్డీఆర్‌ఎఫ్ దీనిపై అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ఆందోళనకు చెందకుండా.. ఇలాంటి సమయాల్లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు దిగి కిందకు రావాలని సూచనలు చేసింది. భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు, ఢిల్లీలో బుధవారం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యింది. దీనికి తోడు ఇప్పుడు భూకంపం రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


