EC affidavit on voter list : ఓటర్ల జాబితాలో మీ పేరుందా..? ఒకవేళ లేకపోతే ఆందోళన చెందుతున్నారా..? ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఓటరు దేవుడికి ఎన్నికల సంఘం (ఈసీ) అభయమిచ్చింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఓటరు జాబితా నుంచి ఒక్క పేరును కూడా తొలగించే ప్రసక్తే లేదని సర్వోన్నత న్యాయస్థానానికి తేల్చి చెప్పింది. ఇంతకీ, ఈసీ ఈ హామీ ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులేంటి? బిహార్‌లో ఏం జరిగింది..? ఈ ప్రకటన ఓటరు హక్కులపై ఎలాంటి ప్రభావం చూపనుంది..? తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం మరో కీలక ముందడుగు వేసింది. బిహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, లక్షలాది మంది పేర్లను అన్యాయంగా తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఎన్నికల సంఘం తన వైఖరిని స్పష్టం చేస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈసీ హామీ ఇదే: ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో ఓటరు భద్రతకు సంబంధించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. “విధానపరంగా, న్యాయసూత్రాలకు కట్టుబడి, 2025 ఆగస్టు 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఏ ఓటరు పేరును తొలగించే ముందు కచ్చితంగా కొన్ని నియమాలు పాటిస్తాం” అని పేర్కొంది. ఆ నియమాలు ఇవే..
ముందస్తు నోటీసు తప్పనిసరి: ఓటరు జాబితా నుంచి పేరును ఎందుకు తొలగించాల్సి వస్తుందో కారణాలను వివరిస్తూ సంబంధిత ఓటరుకు ముందస్తుగా నోటీసు జారీ చేస్తారు.
వాదనకు అవకాశం: నోటీసు అందుకున్న ఓటరు తన వాదనలు వినిపించుకోవడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి తగినంత సమయం, అవకాశం కల్పిస్తారు.
సమర్థ అధికారి ఉత్తర్వులు: ఓటరు వాదనలను పరిశీలించిన తర్వాత, సంబంధిత సమర్థ అధికారి అన్ని వివరాలతో కూడిన రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా ఏ ఒక్కరి పేరునూ జాబితా నుంచి తొలగించబోమని ఈసీ గట్టి భరోసా ఇచ్చింది.
చట్టం ఏం చెబుతోంది : ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చని వ్యక్తుల ప్రత్యేక జాబితాను తయారు చేయాల్సిన అవసరం గానీ, దానికి గల కారణాలను ప్రచురించాల్సిన బాధ్యత గానీ చట్టప్రకారం తమపై లేదని ఈసీ స్పష్టం చేసింది. “ముసాయిదా జాబితా నుంచి పేరును మినహాయించడం అంటే, తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు కాదు” అని పోల్ ప్యానెల్ తేల్చిచెప్పింది. ఇది కేవలం ఒక ముసాయిదా మాత్రమేనని, తుది జాబితా ప్రచురణకు ముందు అన్ని అభ్యంతరాలను, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
రాజకీయ పార్టీలకు సమాచారం: ముసాయిదా జాబితా ప్రచురణకు ముందు, ఏ కారణం చేతనైనా గణన ఫారాలు అందని వ్యక్తుల బూత్-స్థాయి జాబితాను రాజకీయ పార్టీలతో పంచుకున్నామని ఈసీ తెలిపింది. వారిని సంప్రదించి, వివరాలు నమోదు చేసేందుకు సహకరించాలని సీఈఓ (CEO) ఇతర అధికారులను ఆదేశించినట్లు కోర్టుకు వివరించింది. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకుండా ఉండేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈసీ పునరుద్ఘాటించింది. అంతేకాకుండా, తొలగింపులకు వ్యతిరేకంగా రెండు అంచెల అప్పీల్ యంత్రాంగం కూడా అందుబాటులో ఉందని కమిషన్ పేర్కొంది.


