EVM transparency in Indian elections : ప్రతి ఎన్నికల తర్వాత తలెత్తే సహజమైన సందేహాలు, ఆరోపణల నడుమ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) విశ్వసనీయత మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ, దేశ అత్యున్నత ఎన్నికల సంస్థ రంగంలోకి దిగింది. తమ ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేదని స్పష్టం చేసింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మరియు ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం నిశితంగా ఖండించింది. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా నిర్వహించామని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఫిర్యాదు చేసేందుకూ ఎవరూ రాలేదు : ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల ముగిసిన బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు, ఇతర రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓడిపోయిన అభ్యర్థుల నుంచి ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. “ఈవీఎంలలోని కాలిపోయిన మెమరీ/మైక్రోకంట్రోలర్‌ను తనిఖీ చేయాలని ఏ ఒక్క అభ్యర్థి నుంచి కూడా మాకు దరఖాస్తు రాలేదు” అని ఈసీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, జూన్ 17న జారీ చేసిన నూతన ప్రామాణిక కార్యాచరణ విధానం (SoP) ప్రకారం, ఫలితాలు వెలువడిన ఏడు రోజుల్లోపు, గెలిచిన అభ్యర్థి తర్వాత రెండో లేదా మూడో స్థానంలో నిలిచిన వారు ఈవీఎంలను తనిఖీ చేయాలని దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ అవకాశాన్ని ఏ అభ్యర్థీ వినియోగించుకోకపోవడం గమనార్హం.
VVPAT లెక్కింపులో సున్నా వ్యత్యాసం : ఈవీఎంల విశ్వసనీయతను నిరూపించేందుకు చేపట్టిన అతిపెద్ద ప్రక్రియ VVPAT స్లిప్పుల లెక్కింపు. ఇందులోనూ తమ లెక్కలు పక్కాగా ఉన్నాయని ఈసీ తేల్చిచెప్పింది. బిహార్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలలో VVPAT స్లిప్పులను లెక్కించారు. మొత్తం 243 నియోజకవర్గాల్లో కలిపి 1,215 పోలింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, VVPAT స్లిప్పులకు మధ్య ఒక్క ఓటు కూడా వ్యత్యాసం రాలేదని ఈసీ ధృవీకరించింది.
పారదర్శకతకు పెద్దపీట : కేవలం ఓట్ల లెక్కింపులోనే కాకుండా, ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం పారదర్శకంగా వ్యవహరించామని ఈసీ తెలిపింది. బిహార్‌లోని 38 జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ తర్వాత, గుర్తింపు పొందిన 12 రాజకీయ పార్టీల నుంచి గానీ, ఓటర్ల నుంచి గానీ తొలగింపులు లేదా చేర్పులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పేర్కొంది. మొత్తం 2,616 మంది అభ్యర్థుల్లో లేదా పార్టీల్లో ఎవరూ రీ-పోలింగ్ నిర్వహించాలని కోరలేదని కూడా స్పష్టం చేసింది. ఎన్నికలు ముగిసిన 72 గంటల్లోనే ప్రాథమిక వివరాలను, ఐదు రోజుల్లోనే పూర్తి గణాంకాలను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు ఈసీ తెలిపింది.
రాజకీయ ఆరోపణలు.. వాస్తవ ఫలితాలు : కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 243 స్థానాలకు గాను 202 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. బీజేపీ 89 స్థానాలు, జేడీయూ 85 స్థానాలు గెలుచుకోగా, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ప్రజలకు పెద్దగా పరిచయం లేని పార్టీలకు కూడా లక్షల ఓట్లు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే, తన ఆరోపణలను నిరూపించేందుకు ఆధారాలు లేవని, కానీ భవిష్యత్తులో అవి బయటకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

