Nationwide voter list verification : ఓటర్ల జాబితాలో మీ పేరు పక్కాగా ఉందా? అనర్హుల పేర్లతో జాబితాలు తప్పుల తడకగా మారుతున్నాయన్న ఆందోళనలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నడుం బిగించింది. ఇప్పటికే బిహార్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టి, లక్షలాది అనర్హుల పేర్లను తొలగించి సంచలనం సృష్టించిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే – SIR)ను ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అసలు ఏమిటీ ‘స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే’? దీని విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి..? రాబోయే కీలక ఎన్నికలపై దీని ప్రభావం ఎంత..?
సీఈసీ నేతృత్వంలో కీలక భేటీ : ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటర్ల జాబితాను పారదర్శకంగా, పకడ్బందీగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షతన బుధవారం రాష్ట్రాల ఎన్నికల సంఘాల ప్రధాన అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఈసీ సీనియర్ అధికారులు ‘స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే’ ఆవశ్యకత, లక్ష్యాలు, అమలు చేయాల్సిన తీరుపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విజయవంతమైన ‘బిహార్ నమూనా’ : దేశవ్యాప్త కార్యక్రమానికి ముందు, ఈసీ ఈ ప్రత్యేక సర్వేను బిహార్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పెద్ద సంఖ్యలో అనర్హుల (చనిపోయినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, నకిలీ ఓటర్లు) పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ ప్రక్రియను ఎలా విజయవంతంగా పూర్తి చేశారో, ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారో బిహార్ రాష్ట్ర ఎన్నికల అధికారి నేటి సమావేశంలో వివరించనున్నారు. ఈ ‘బిహార్ నమూనా’నే దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవనుంది.
లక్ష్యం.. జాబితాల సమగ్రత : ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, దేశంలోకి అక్రమంగా వలసవచ్చి, అడ్డదారుల్లో ఓటు హక్కు పొందిన వారిని గుర్తించి తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా, అనర్హులకు ఆ అవకాశం లేకుండా చేయాలన్నది ఈసీ సంకల్పం.
వివాదాలు.. సుప్రీంకోర్టు తీర్పు : అయితే, ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఈ చర్యపై గతంలో కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సర్వే నిర్వహిస్తున్నారని ఆరోపించాయి. దీనిపై ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా ఉంచేందుకు ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈసీకి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
రాబోయే ఎన్నికలే లక్ష్యమా : వచ్చే ఏడాది (2026) తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ ఎన్నికలలోపు జాబితాల ప్రక్షాళన పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. అందువల్ల ఈ ఏడాది చివరి నాటికే దేశవ్యాప్తంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే’ను పూర్తి చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


