Critical Minerals in Economic Survey : ఒకప్పుడు ప్రపంచాన్ని చమురు (Oil) శాసించేది. చమురు నిల్వలు ఉన్న దేశాలదే పైచేయిగా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. పెట్రోల్, డీజిల్ స్థానాన్ని ‘హరిత ఇంధనం’ ఆక్రమిస్తున్న వేళ.. కొత్త రకమైన ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం తక్కువ కర్బన ఉద్గారాల ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న ప్రపంచానికి.. కొన్ని రకాల ఖనిజాలే ఇప్పుడు ప్రాణవాయువుగా మారాయి. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య పొంచి ఉందని తాజా ‘ఎకనామిక్ సర్వే’ బాంబు పేల్చింది. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాలు భవిష్యత్తులో ‘వ్యూహాత్మక అడ్డంకులు’గా మారి, దేశాల ఇంధన భద్రతనే ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు.
ఖనిజాలే కొత్త ఇంధన వనరులు : ఆర్థిక సర్వే ప్రకారం.. లిథియం, కోబాల్ట్, నికెల్, రాగి మరియు ఇతర అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ ఇప్పుడు కేవలం లోహాలు మాత్రమే కాదు. అవి ఆధునిక ఆర్థిక వ్యవస్థను నడిపించే ఇంధనాలు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల నుంచి సోలార్ ప్యానెల్స్ వరకు ప్రతి దాని తయారీలో ఇవే కీలకం. అందుకే వీటిని ‘క్రిటికల్ మినరల్స్’గా పిలుస్తున్నారు. అయితే, వీటి లభ్యత, సరఫరా గొలుసులో వస్తున్న మార్పులు ప్రపంచ దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
‘చోక్ పాయింట్స్’ అంటే ఏంటి : ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తన నివేదికలో ‘వ్యూహాత్మక చోక్ పాయింట్స్’ అనే పదాన్ని ప్రయోగించారు. దీని అర్థం.. గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం.
నియంత్రణ: ఈ ఖనిజాలు కొన్ని దేశాల్లోనే అత్యధికంగా లభిస్తున్నాయి. ఆయా దేశాలు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి.
జియోపాలిటిక్స్: ఇంధన భద్రత, పారిశ్రామిక పోటీతత్వం, భౌగోళిక రాజకీయ శక్తిని ఈ ఖనిజాలు ప్రభావితం చేస్తున్నాయని సర్వే పేర్కొంది. వీటి సరఫరాను ఆపేస్తామని బెదిరించడం ద్వారా బలమైన దేశాలు, ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉంది.
సరఫరా గొలుసులో ‘ఉచ్చు’.. ఆర్ధిక సర్వే ఆందోళన : ఈ ఖనిజాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. అభివృద్ధి చెందిన దేశాలు ‘ప్రమాణాల ఆధారిత మార్కెట్లు’ పేరుతో కొత్త నిబంధనలు తెస్తున్నాయి. ఇది వర్ధమాన దేశాలకు పెను సవాలుగా మారనుందని సీఈఏ విశ్లేషించారు.ఈ నిబంధనల వల్ల ఖనిజాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరే ప్రమాదం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం ముడి ఖనిజాలను తవ్వే స్థాయిలోనే ఉండిపోయి, తక్కువ విలువ కలిగిన విభాగాల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ప్రాసెసింగ్, టెక్నాలజీ వంటి అధిక లాభాలు వచ్చే రంగాలు సంపన్న దేశాల గుప్పిట్లోనే ఉండిపోతాయని సర్వే హెచ్చరించింది.
భారత్‌కు ఎందుకు ముఖ్యం : భారత్ తన ఇంధన అవసరాల కోసం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఈ ఖనిజాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడితే అది మన ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి, ఇంధన భద్రతకు గట్టి దెబ్బే అవుతుంది. అందుకే సొంతంగా గనుల అన్వేషణ, అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్ దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఈ సర్వే నొక్కి చెప్పింది.

