Sunday, February 8, 2026
HomeTop StoriesUnion budget 2026: జంక్‌ఫుడ్‌కు చెక్‌.. ఆరోగ్యానికి కిక్‌! టీవీల్లో ఆ వాణిజ్య ప్రకటనలు బంద్?

Union budget 2026: జంక్‌ఫుడ్‌కు చెక్‌.. ఆరోగ్యానికి కిక్‌! టీవీల్లో ఆ వాణిజ్య ప్రకటనలు బంద్?

junk food tv ads banned: మీ పిల్లలు టీవీకి అతుక్కుపోతున్నారా? కార్టూన్ల మధ్యలో వచ్చే పిజ్జాలు, బర్గర్ల యాడ్స్ చూసి అవి కావాలని మారం చేస్తున్నారా? అయితే మీలాంటి తల్లిదండ్రులకు ఇది నిజంగా శుభవార్తే. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఊబకాయం,  మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు కళ్ళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘ఆర్ధిక సర్వే’ ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. చిన్నారులను ఆకర్షించే జంక్‌ఫుడ్ ప్రకటనలపై ( junk food tv ads ) ఉదయం నుంచి రాత్రి వరకు నిషేధం విధించాలని సూచించింది. కేవలం జంక్‌ఫుడ్ మాత్రమే కాదు, పసిపిల్లల పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌పైనా కొరడా ఝుళిపించాలని సిఫార్సు చేసింది. అసలు ఈ నిషేధం ఏ సమయాల్లో ఉంటుంది? దీనివల్ల సామాన్యుడి ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటి? సర్వే వెల్లడించిన ఆసక్తికర విషయాలేంటో ఈ కథనంలో చూద్దాం..

- Advertisement -

ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు.. నో ‘జంక్’ యాడ్స్ : ఆర్థిక సర్వే చేసిన అత్యంత కీలకమైన సిఫార్సులలో జంక్‌ఫుడ్ ప్రకటనల నియంత్రణ ప్రధానమైనది.
ప్రైమ్ టైమ్ టార్గెట్: పిల్లలు టీవీలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాలను ఎక్కువగా వీక్షించే సమయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో పిల్లలను ఆకట్టుకునేలా జంక్‌ఫుడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను (హై ఫ్యాట్, సుగర్, సాల్ట్ – HFSS Foods) ప్రచారం చేస్తున్నాయి.

నిషేధాస్త్రం: ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు, ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య టీవీలు, ఓటీటీలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో జంక్ ఫుడ్ ప్రకటనలను పూర్తిగా నిషేధించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇది అమలైతే పిల్లల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పు వస్తుందని అంచనా.

తల్లిపాలే శ్రేయస్కరం.. వాణిజ్య ప్రకటనలు వద్దు : కేవలం జంక్ ఫుడ్ మాత్రమే కాదు, పసిపిల్లల ఆహారం విషయంలోనూ సర్వే కఠిన వైఖరి ప్రదర్శించింది.
మిస్ లీడింగ్ మార్కెటింగ్: తల్లిపాలకు ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రచారం చేసుకుంటున్న బేబీ ఫుడ్, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ పై ఆంక్షలు విధించాలని సూచించింది.
తల్లిపాలకు ప్రాధాన్యం: వాణిజ్యపరమైన బేబీ ఫుడ్స్ కంటే తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యకరమని, తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టాలని స్పష్టం చేసింది.

ఎందుకీ కఠిన నిర్ణయం? – భయపెడుతున్న గణాంకాలు : భారతదేశం ‘డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా మారుతుందన్న ఆందోళనల నడుమ ఈ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఊబకాయం ముప్పు: దేశంలో చిన్నారులు, యుక్తవయస్కులలో ఊబకాయం సమస్య ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి ప్రధాన కారణం ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెరలు అధికంగా ఉండే పానీయాలే.
ఆరోగ్య సంక్షోభం: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దేశ ప్రజారోగ్య వ్యవస్థపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగం ఆసుపత్రుల పాలవుతున్నారు.

అంతర్జాతీయ బాటలో భారత్ : ఇప్పటికే బ్రిటన్, మెక్సికో వంటి దేశాలు జంక్ ఫుడ్ ప్రకటనలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక సర్వే బలంగా కోరింది. “ఆరోగ్యకరమైన ఆహారం.. ఆరోగ్యవంతమైన భారత్” అనే నినాదంతో ఈ సిఫార్సులను ప్రభుత్వం త్వరలో విధానపరమైన నిర్ణయాలుగా మార్చే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News