Fake government job scam raids : ప్రభుత్వ కొలువుల పేరుతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఓ భారీ కుంభకోణం గుట్టురట్టయింది. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని, లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఓ వ్యవస్థీకృత ముఠాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపింది. గురువారం తెల్లవారుజాము నుంచే, ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడుల మోత మోగించింది.
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కొందరు వ్యక్తులు వ్యవస్థీకృతంగా మోసాలకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా, గురువారం దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించింది.
ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు : ఈడీ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో, మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 15 కీలక ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
బిహార్: ముజఫర్‌పూర్, మోతీహరి
పశ్చిమ బెంగాల్: కోల్‌కతా
కేరళ: ఎర్నాకుళం, పండలం, అడూర్, కొడూర్
తమిళనాడు: చెన్నై
గుజరాత్: రాజ్‌కోట్
ఉత్తర ప్రదేశ్: గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, లఖ్‌నవూ
ఈ సోదాల్లో, ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మోసం చేసేదిలా : ఈ ముఠా, నిరుద్యోగ యువతనే లక్ష్యంగా చేసుకుని, పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ ప్రభుత్వ వెబ్‌సైట్లు, నియామక పత్రాలు సృష్టించి, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దాడుల ద్వారా, ఈ భారీ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులను, వారి కార్యకలాపాల పూర్తి స్వరూపాన్ని వెలికితీయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత, ఈ కుంభకోణం య పూర్తి వివరాలు, ఎంతమంది బాధితులు మోసపోయారు, ఎంత మొత్తం చేతులు మారింది అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

